సినీనటి, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆమెను నాగ్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. కాగా.. కొద్ది రోజుల క్రితం నవనీత్‌ కౌర్‌ తో సహా కుటుంబంలోని 12 మంది కరోనా వైరస్‌ సోకిన విషయం తెలిసిందే. దీంతో ఆమె అమరావతిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే, చికిత్స పొందుతున్న క్రమంలో ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో నాగ్‌పూర్‌లోని ఓఖార్డ్ ఆస్పత్రికి తరలించారు. నవనీత్ కౌర్ భర్త, ఎమ్మెల్యే రవి రానాకు ఆగస్టు 6న కరోనా పాజిటివ్‌గా తేలింది. తరువాత కుటుంబంలోని మొత్తం 12 మంది సభ్యులు ఈ వైరస్ బారిన పడ్డారు. ఇందులో నవనీత్ కౌర్ పిల్లలు, అత్తమామలు కూడా ఉన్నారు.

తమకు కరోనా సోకిందని నిర్థారణ కావడంతో.. ఈ దంపతులు తమతో సన్నిహితంగా ఉన్న వారందరూ హోం ఐసోలేషన్‌లో ఉండాలని, కరోనా పరీక్షలు చేయించుకోవాలని సోషల్ మీడియాలో సూచించారు. నవనీత్‌ కౌర్‌ తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించారు. రవి రానాను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో అమరావతి నియోజకవర్గం నుంచి ఎంపీగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. శివనసేన ఎంపీ ఆనందరావును భారీ తేడాతో ఓడించారు. నవనీత్ కౌర్ భర్త, యువ స్వాభిమాన్ పార్టీ నాయకుడు రవి రానా బద్నేరా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.