మందడంలో మహా పాదయాత్ర..రేపు మంత్రులతో సీఎం సమావేశం
By రాణి Published on 6 Jan 2020 12:51 PM ISTఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం 11 గంటలకు పార్టీ ఇన్ చార్జ్ మంత్రులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా త్వరలో జరగనున్న స్ధానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగనుంది. జిల్లాలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను సీఎం జగన్ ఇన్చార్జ్ మంత్రులకు అప్పగిస్తారని తెలుస్తోంది. అలాగే రాష్ర్టానికి మూడు రాజధానుల ప్రకటనపై వివిధ జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను మంత్రులంతా కలిసి జగన్ కు వివరించనున్నారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ సీట్లను సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ..స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాటుతుందన్న ధీమాతో ఉన్నారు పార్టీ మంత్రులు. ఆ మేరకు ఇన్ చార్జ్ మంత్రులంతా కృషి చేయనున్నారు.
రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న నిరాహార దీక్షలు సోమవారానికి 20వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు నుంచి 10 వేల మంది రైతులు, యువకులు, మహిళలతో మందడం వరకూ మహా పాదయాత్ర చేశారు. పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు తెలిపినప్పటికీ..మమ్మల్ని ఎవ్వరూ అడ్డకోలేరని రైతులు స్పష్టం చేశారు. మూడు రాజధానులు వద్దు..ఒక రాజధాని ముద్దు, జై అమరావతి అనే స్లోగన్ లతో జాతీయ జెండాలు చేపట్టి రైతులు ముందుకు సాగుతున్నారు. బోస్టన్, జీఎన్ రావు కమిటీలు రాష్ర్ట ప్రభుత్వ జిరాక్స్ కాపీలుగా మారాయని, రేపు వచ్చే హై పవర్ కమిటీ నివేదిక ప్రభుత్వానికి కలర్ జిరాక్స్ అని రైతులు ఆరోపించారు.