రాజధాని రైతుల దీక్షకు చంద్రబాబు దంపతుల మద్దతు
By రాణి Published on 1 Jan 2020 12:58 PM ISTఏపీ ప్రస్తుత రాజధాని అమరావతి రైతులు చేస్తున్న దీక్షలో మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సతీమణితో కలిసి పాల్గొని, మద్దతు తెలిపారు. రాజధాని కోసం అమరావతి రైతులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో..నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో బుధవారం చంద్రబాబు రాజధాని గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తమ సమస్యలను చంద్రబాబుకు వివరించారు.
విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ...రాజధానిని తరలించడం ఎవరితరం కాదన్నారు. రైతులతో పెట్టుకున్న వారెవరూ బాగుపడలేదని, చట్టపరంగా, న్యాయపరంగా రైతుల కోసం అన్ని రకాలుగా పోరాడుతామన్నారు. కొత్త సంవత్సరం మొదటిరోజున జగన్ రైతులందరూ రోడ్డెక్కెలా చేశారని విమర్శించారు. ఈ దీక్షలో టీడీపీ నేతలు కనకమేడల రవీంద్ర, బోండా ఉమా, గల్లా అరుణ తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతిలో వర్షం వచ్చినా, డ్యామ్ లలో నీరు నిండి కిందికి వదిలినా.. మునిగిపోతుందని చెప్పి ఒకేసారి నీళ్లు వదిలి నా ఇల్లు ముంచడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి నమ్మించాలని చూస్తున్నారు. అధికార ప్రభుత్వం చెప్పేవన్నీ అవాస్తవాలేనన్నారు. ఇక్కడ అంతా చట్ట ప్రకారమే చేస్తే..అదేం లేదు గ్రాఫిక్స్ తో చేశామంటున్న వాళ్లకి భవనాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాజధాని వల్ల రైతుల భూముల విలువలు పెరిగితే మీకొచ్చిన కడుపు మంట ఏమిటని అడిగారు. జీఎన్ రావు ఒక అసమర్థ అధికారి, బోస్టన్ కన్సల్టెన్సీ ఒక అవినీతి సంస్థ అని చంద్రబాబు విమర్శించారు. స్వాతంత్ర్యం వచ్చాక మారిన ముఖ్యమంత్రులంతా ఇలాగే రాజధానులను మార్చారా ? రాష్ర్ట విభజన కారణంగా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి తప్పా ఇలా రాజధానులను మార్చిన సంఘటనలు ఎక్కడా లేవన్నారు.
రైతుల తరపున పోరాడేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తుళ్లూరుకు వస్తే పోలీసులతో ముళ్ల కంచెలు అడ్డం వేయించడంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. రాజధానిని కాపాడే బాధ్యత యువత, రైతులు, మహిళలపైనే ఉందని, అందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.
చంద్రబాబు సతీమణి నారా భూవనేశ్వరి మాట్లాడుతూ..మహిళా రైతులు పడుతున్న బాధను సాటి మహిళగా అర్థం చేసుకున్నానన్నారు. చంద్రబాబు ప్రజల తర్వాతే కుటుంబాన్ని పట్టించుకునేవారని, ఎప్పుడూ అమరావతి, పోలవరం అంటూ కలవరిస్తూ ఉండేవారన్నారు. ఆరోగ్యం కూడా లెక్కచేయకుండా పూర్తిగా ప్రజల కోసమే కష్టపడ్డారన్నారు. రైతుల నమ్మకాన్ని ఆయనెప్పుడూ వమ్ము చేయరని, రైతులకు మద్దతిస్తూ మా కుటుంబం అండగా ఉంటుందన్నారు.