ఒక వైపు అమరావతి భద్రత, వరద ముంపు ప్రభావం గురించి చర్చోపచర్చలు జరుగుతూండగానే శనివారం రాత్రి భూకంపం సంభవించింది. శనివారం రాత్రి సూర్యాపేట జిల్లా, నల్గొండ, కృష్ణా గుంటూరు జిల్లాల్లో తెల్లవారుజామున 2.37 గంటలకు భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై ఇది. 4.6 గా నమోదైంది. ఈ భూకంపానికి కేంద్రం సూర్యాపేట్ జిల్లాలోని వెలుటూరుగా ఎన్ జీ ఆర్ ఐ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిపై అధ్యయనాలు చేయబోతున్నట్టు ఎన్ జీ ఆర్ ఐ చీఫ్ సైంటిస్ట్ డా. శ్రీనగేశ్ చెప్పారు.

భూకంపం రాగానే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పాతబస్తీలోని హుసేనీ మొహల్లాలో నివసించే అక్బర్ అలీ రిజ్వీ తాను రాత్రి ఇంట్లోంచి బయటకు పరుగెత్తానని, రాత్రంతా ఆరుబయటే గడిపామని, రాత్రంతా నిద్ర లేదని చెప్పారు. కోదాడ, హుజూర్ నగర్, మేళ్ల చెరువు, చింతలపాలెం, పాలకీడు మాతంపల్లి వంటి ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సైతం భూకంపం సంభవించే ప్రాంతంగా గుర్తింపులో ఉన్న నేపథ్యంలో తాజా భూకంపం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

వెల్లటూరు వద్ద ఒక భూగర్భ పలక లో కదలికల వల్ల ఈ భూకంపం సంభవించిందని, భూకంప కేంద్రం కృష్ణా నదీ గర్భంలో ఉందని డా. శ్రీనగేశ్ చెప్పారు. అమరావతి కూడా కృష్ణా నది ఒడ్డునే ఉందన్నది ఈ సందర్భంగా గమనార్హం. నిజానికి తెలంగాణతో పలిస్తే ఆంధ్ర ప్రాంతంలోనే భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

నగరాల భూకంప భద్రతపై ప్రశ్నచిహ్నాలు

మరో వైపు హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ, జాతీయ విపత్తు నివారణ సంస్థ లు మన నగరాల కోసం భూకంప విపత్తు ప్రమాద సూచికను రూపొందించారు. ఈ సూచిక తాజా నివేదిక కూడా నగరాల భూకంప భద్రత విషయంలో ఆందోళనకరమైన అంశాలను ఎత్తిచూపింది. ట్రిపుల్ ఐటీ వారు 2006 నుంచి తమ భూకంప సంబంధిత ఇంజనీరింగ్ పరిశోధనా కేంద్రంలో (ఈఈఆర్ సీ) 2006 నుంచి అద్యయనాలు నిర్వహిస్తూ భూకంపాలను తట్టుకునే భవనాల రూపకల్పనపై పనిచేస్తున్నారు.

ఈఈఆర్ సీ ప్రొఫెసర్ ప్రదీప్ రామన్ చరియా కథనం ప్రకారం.. దేశంలోని 56 శాతం భూభాగంలో ఒక మోస్తరు నుంచి తీవ్రమైన భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. ఈ 56 శాతం భూభాగంలోనే దేశంలోని 82 శాతం జనాభా నివసిస్తోంది. కాబట్టి దేశ జనాభాలోని ప్రతి అయిదుగురిలో నలుగురు భూకంప ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. ప్రజల్లో భూకంప సమయాల్లో భద్రత విషయంలో, భూకంపాలను తట్టుకోగలిగే భవనాల నిర్మాణం విషయంలో అవగాహన కల్పించడం ఈ సంస్థ లక్ష్యం. ఆర్కిటెక్టులను, ఇంజనీర్లను కొత్త భవనాల్లో తగిన బలిమి ఉండే ఫ్రేమ్ వర్క్ ను ఏర్పాటు చేయడం, ఇప్పటికే నిర్మితమైన భవనాలు భూకంపాలను తట్టకోగలవా అన్నది పరివీలించి, పరిష్కార మార్గాలు చూసించడంలో ఈ సంస్థ పనిచేస్తోంది.

గత పదమూడేళ్లలో వివిధ రాష్ట్రాలు, నగరాల్లో మూడు ప్రాజెక్టుల ద్వారా అధ్యయనం చేసి, భూకంపం వచ్చే అవకాశాలు, నగరాలు ఏ విధంగా నష్టాలను ఎదుర్కోవచ్చు వంటి అంశాలను ఈ సంస్థ అధ్యయనం చేసింది. భూమి ఏ మేరకు కంపిస్తుంది, ప్రభావిత ప్రాంతంలో ఎన్ని భవనాలున్నాయి, ఆ భవనాలు భూకంపాలను తట్టుకోగలవా అన్న అంశాలను అధ్యయనం చేశామని రామంచర్ల చెబుతున్నారు. పరిశోధకులు భవనాల వైబ్రేషన్ డేటాను సేకరించి, ఆ డేటాను ఒక కంప్యూటర్ మాడల్ లో ఫీడ్ చేసి, భూకంప సమయాల్లో భవనాలు ఏ మేరకు నష్టపోతాయో అధ్యయనం చేశారు. ఈ భవనాల ప్రకంపనల ఆధారంగా నగరాల ప్రమాద స్థాయిని లెక్కించడం జరుగుతుంది.

కొండప్రాంతాల్లో ఉన్న నగరాల్లో మరింత..

జాతీయ విపత్తు నివారణ సంస్థ జన సాంద్రత ఆధారంగా నగరాలను ఎంపిక చేసింది. ప్రభుత్వం ఎంపిక చేసిన స్మార్ట్ సిటీస్ ను కూడా అధ్యయనం చేయడం జరిగింది. భూకంపాలు ఎక్కువగా వచ్చే సీస్మిక్ జోన్ 4, సీస్మిక్ జోన్ 5 లలో ఉన్న 50 నగరాలను ఎంపిక చేశారు. ఇందులో 15 నగరాలు సీస్మిక్ జోన్ 5 లో ఉండగా, 28 సీస్మిక్ జోన్ 4 లో ఉన్నాయి. మిగతా ఏడు మెట్రో నగరాలు. ప్రమాద స్థాయి తక్కువగా, ఎక్కువగా, మధ్యస్థంగా అంచనా వేయడం జరిగింది. అధ్యయనం చేసిన నగరాల్లో ఒక్క నగరం కూడా భద్రంగా లేదని అధ్యయనంలో తేలింది.

కొండప్రాంతాల్లో ఉన్న నగరాలలో రిస్క్ మరింత ఎక్కువగా ఉందని తేలింది. జనాభా ఎక్కువగా ఉన్న నగరాల్లో నష్టం మరింత ఎక్కువగా ఉండవచ్చునని కూడా అధ్యయనం తేలింది. కేవలం అయిదు నగరాలు మాత్రమే తక్కువ ప్రమాద స్థాయిలో ఉన్నాయని, 36 నగరాల్లో మధ్యస్థమైన ప్రమాదస్థాయి ఉందని, తొమ్మిది నగరాలు అత్యధిక ప్రమాద స్థాయిలో ఉన్నాయని తెలింది. ఈ నగరాల్లోని భవనాల నిర్మాణపరమైన అంశాల అద్యయనం చేసి, రిట్రో పిట్టింగ్ ప్రక్రియ ఆధారంగా మెరుగుపరచవచ్చునని అధ్యయనం తేల్చింది. ఈ డీ ఆర్ ఐ ఈ దిశగా భూకంప ప్రమాదం ఉన్న ప్రాంతాలలో సలహాలు ఇస్తుందని ఆయన తెలిపారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.