హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో నేవీ యాంకర్, టార్పెడో
By రాణి Published on 23 Dec 2019 1:39 PM ISTముఖ్యాంశాలు
- నావికాదళం ఉపయోగించిన యాంకర్, టార్పెడో
- 1994 బ్యాచ్ విద్యార్థులు సిల్వర్ జూబ్లీ సందర్భంగా బహూకరణ
- భారీగా బరువున్న టార్పెడో (అంతర్జల మిస్సైల్)
హైదరాబాద్ : దేశ రక్షణకోసం సర్వస్వాన్నీ త్యాగం చేసే జవానుల సేవల్ని ఈ జాతి మరువలేదు. సరిహద్దుల్లో అహరహం వాళ్లు కాపలా కాయడం వల్లే దేశం లోపల మనం ఇక్కడ సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది పూర్తి స్థాయిలో తమ జీవితాలను దేశ రక్షణకోసమే అంకితం చేసి నిరంతరం సేవలు అందిస్తున్నారు. వారి జాతీయ సేవా స్ఫూర్తిని ముందు తరాలకు అందించడం కోసం హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఓ వినూత్న తరహా ఆలోచన చేసింది. దీనిలో భాగంగా సైన్యం ఉపయోగించిన వస్తువులను, పోరాట శకటాలను, ఎయిర్ క్రాఫ్ట్ ను తెప్పించి విద్యార్థులకోసం తమ పాఠశాలలో ఉంచింది.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జాతీయ స్ఫూర్తిని పెంచే వస్తువులు
ఈ స్ఫూర్తిని విద్యార్థులకు చేరువచేయడంలో ముందుండే బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఇప్పుడు మరో ఘనతను దక్కించుకుంది. భారతీయ నావికాదళం ఉపయోగించిన ఒక బరువైన లంగరును, భారీ టార్పెడోను సొంతం చేసుకుంది. త్రివిధ దళాలు ఉపయోగించిన వస్తువులను స్కూల్లో ఉంచడంద్వారా విద్యార్థుల్లో జాతీయ స్ఫూర్తిని, సైన్యం పట్ల చిన్ననాటినుంచే అవగాహనను పెంపొందించాలన్న ఆలోచనతో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వీటిని సేకరించింది. ఇప్పటికే స్కూల్లో ఒక ఆర్మీట్యాంక్, ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఉన్నాయి. నేవీ, ఎయిర్ ఫోర్స్ సైనిక విభాగాల పట్ల పిల్లల్లో చిన్ననాటి నుంచీ చాలా ఉత్సాహం కనిపిస్తుంది. ఈ ఉత్సాహాన్ని మరింతగా పెంచి భవిష్యత్తులో దేశ రక్షణ కోసం సైన్యంలో పిల్లలు ఎదిగిన తర్వాత భాగస్వాములు అయ్యే విధంగా ఉత్తేజాన్ని కలిగించడమే తమ లక్ష్యమని స్కూల్ నిర్వాహకులు చెబుతున్నారు.
ఒకటిన్నర టన్ను బరువున్న యాంకర్
ఒకటిన్నర టన్నుల బరువున్న యాంకర్ ముంబైనుంచి, విశాఖపట్నంలోని ఈస్టర్న్ నావల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ నుంచి టార్పెడోను తెప్పించారు. ప్రస్తుతం వీటిని సరైన, సముచితమైన స్థానంలో స్కూల్లో ఏర్పాటు చేసే పనిలో ఉంది యాజమాన్యం. త్వరలోనే వీటిని చూసేందుకు విద్యార్థులకు అవకాశం కలుగుతుంది. 1994 బ్యాచ్ కి చెందిన విద్యార్థులు ఈ వస్తువులను సేకరించి స్కూల్ కి బహూకరించారు. ఈ బ్యాచ్ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా తాము చదువుకున్న స్కూల్ కి విద్యార్థినీ విద్యార్థులు ఈ కానుకలను అందించడం విశేషం. జాతీయ స్ఫూర్తిని పెంపొందించే అనేక అంశాలను, వస్తువులను నిత్యం పిల్లలకు కనిపించే విధంగా ఉంచే ప్రయత్నం చేస్తామని, వారిలో దేశ భక్తిని పెంపొందించే ప్రయత్నం చేస్తామని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం చెబుతోంది.