బిజినెస్ మ్యాన్ నుండి పొలిటీషియన్ గా మారిన మాజీ మినిస్టర్ అల్తాఫ్ బుఖారీ కాశ్మీర్ లో కొత్త పార్టీని స్థాపించారు. జమ్మూ అండ్ కాశ్మీర్ అప్ని పార్టీ(జెకెఏపీ) అనే పార్టీ పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలైనటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ(ఎన్.సి.), పీపుల్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) లకు ప్రత్యామ్నాయంగా తాను కొత్త పార్టీని స్థాపించినట్లు ఆయన చెబుతున్నారు. కొసమెరుపేమిటంటే ఆ రెండు పార్టీలలోనూ అల్తాఫ్ బుఖారీ ఒకప్పుడు సభ్యుడే..!

1947 తర్వాత కాశ్మీర్ లోయలో స్థాపించిన మొదటి పార్టీగా జెకెఏపీ చరిత్ర లిఖించింది. తాము ప్రజల్లో లేనిపోని ఊహలను, ఆశయాలను సృష్టించమని.. కేవలం నిజాయితీగా ఏదైతే సాధించగలమో మాత్రమే చెబుతామని ఆయన అంటున్నారు. భవిష్యత్తు తరాల కోసం పాటు పడే ఆశయాలు ఉన్న వాళ్ళతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని.. వారందరికీ తమ పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నామని ఆయన అన్నారు. బుఖారీ 2014 లో పీడీపీ పార్టీలో జాయిన్ అయ్యాడు. 84 కోట్ల రూపాయలు ఆస్థులు తనకు ఉన్నాయంటూ ప్రకటించి అందరినీ షాక్ కు గురిచేశారు.

ఆర్టికల్ 370 గురించి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తన పని చేసుకుంటూ వెళ్లిందని.. ఇక సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నామన్నారు. తమ పార్టీ ముఖ్య ఉద్దేశ్యం స్థానికంగా అభివృద్ధి చేయడమే కాకుండా.. ఉపాధి అవకాశాలను సృష్టించాలని అనుకుంటున్నామన్నారు. జమ్మూ కాశ్మీర్, లడాఖ్ లను మళ్ళీ ఒకటి చేయాలనే డిమాండ్ తమ పార్టీ చేయబోదని ఆయన చెప్పుకొచ్చారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు భాగాలుగా విభజించిన తర్వాత పీడీపీ, ఎన్సీ పార్టీలు సైలెంట్ అయిపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. బుఖారీ పెట్టిన పార్టీలోకి పలువురు నేతలు వచ్చే వచ్చే అవకాశం ఉంది. పీడీపీ నేత ముజఫ్ఫర్ హుస్సేన్ బైగ్ కూడా బుఖారీతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. పీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు దాదాపు 12 మంది బుఖారీ చెంతన చేరే అవకాశం ఉంది. ఇప్పటికే తర్వాతి ముఖ్యమంత్రి బుఖారి అని వార్తలు వస్తున్న సమయంలో కాంగ్రెస్, ఎన్సీ నేతలు 40 మంది వరకూ జెకెఏపీ పార్టీలోకి చేరనున్నారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.