10 ఎకరాల్లో అల్లు స్టూడియోస్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Oct 2020 11:39 AM GMT
10 ఎకరాల్లో అల్లు స్టూడియోస్

తెలుగు చిత్రసీమ గర్వించదగ్గ హాస్యనటుల్లో అల్లురామలింగయ్యది ప్రత్యేక స్థానం. హాస్యానికి తను చిరునామా అయ్యారు. ఏ పాత్రలో అయినా పరకాయప్రవేశం చేసి మెప్పించారు. ఇవాళ అల్లు రామలింగయ్య 99వ జయంతి. ఈ సంద‌ర్భంగా అల్లు రామ‌లింగ‌య్య‌కు వారి కుటుంబ‌స‌భ్యులు ఘ‌నంగా నివాళి అర్పించారు. అల్లు రామ‌లింగ‌య్య జ‌యంతిని పుర‌స్క‌రించుకుని అల్లు వారి కుటుంబం ప్ర‌త్యేక ప్ర‌క‌ట‌న‌ను వెలువ‌రించింది. అల్లు అర‌వింద్ అండ్ ఫ్యామిలీ అల్లు రామ‌లింగ‌య్య పేరు మీదుగా అల్లు స్టూడియోస్ ను ఏర్పాటు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. స్డూడియోస్‌కు సంబంధించిన పనులను మొదలు పెట్టినట్లు తెలిపారు.

హైద‌రాబాద్ లోని గండిపేట్ ప్రాంతంలో 10 ఎక‌రాల విస్తీర్ణంలో అల్లు స్టూడియోస్ ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్న‌ట్టు ఆయన తనయుడు అల్లు అర‌వింద్ తోపాటు అల్లు బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీష్ ప్ర‌క‌టించారు. అత్యాధునిక సౌక‌ర్యాల‌తో ఫిల్మ్ మేకింగ్ కు అనుకూలంగా ఉండేలా ఆర్ట్ ఫిలిం స్డూడియో నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు. స్డూడియో నిర్మాణ పనులు కూడా త్వ‌ర‌లోనే షురూ కానున్న‌ట్టు సమాచారం.

'మా తాతయ్య నట వారసత్వానికి గుర్తుగా ఆయన పేరుతో అల్లు స్టూడియోస్‌ను ప్రారంభించబోతున్నాం. దీన్ని ఆయనకు అంకితమిస్తాం. ఇందుకు సంబంధించిన పనులు మొదలు పెట్టాం. మాకు ఆశీస్సులు, శుభాకాంక్షలు కావాలి' అని అల్లు అర్జున్‌ అభిమానులను కోరారు.



అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా ఆయన అల్లుడు, మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో స్పందించారు. ఆయన పేరు గుర్తుకురాగానే అందరి పెదాలపై చిరునవ్వు మెదుల్తుందని తెలిపారు. "మావయ్య గారు అందరినీ మెప్పించిన నటుడే కాదు.. తియ్యని గుళికలతో వైద్యం చేసే హోమియోపతి వైద్యుడు కూడా. ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు, తత్వవేత్త, నాకు మార్గదర్శి, గురువు. అన్నింటికి మించి మనసున్న మనిషి. ఈ 99వ పుట్టినరోజు సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ.. వచ్చే ఏడాది ఆయన శతజయంతి వేడుక ఆయన జీవితాన్ని, జీవన విధానాన్ని ఆవిష్కరిస్తుందని ఆశిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు.



Next Story