టీ20 వరల్డ్ కప్ అసాధ్యం.. ఐపీఎల్‌కు లైన్ క్లియర్..!
By తోట వంశీ కుమార్ Published on 16 Jun 2020 5:00 PM ISTకరోనా మహమ్మారి కారణంగా మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే క్రీడలు మొదలవుతున్నాయి. ఇక ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. అయితే.. కరోనా ముప్పుతో ఈ టోర్నీ జరగకపోవచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు చెర్మన్ ఎడ్డింగ్స్ వ్యాఖ్యలు వీటికి మరింత బలం చేకూర్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో టీ20 ప్రపంచకప్ నిర్వహించకపోవడం సాధ్యం కాకపోవచ్చునని ఆయన అన్నారు. దీంతో ఐపీఎల్‌కు లైన్ క్లియర్ అయినట్లే.
ఆస్ట్రేలియా ప్రభుత్వం జూలై నుంచి 25 శాతం మంది ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే టీ20 ప్రపంచకప్ నిర్వహిస్తారని అంతా బావించారు. ‘టీ20 ప్రపంచకప్ లో పాల్గొనే చాలా దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో ఆయా దేశాలు తమ క్రీడాకారులను ఆస్ట్రేలియాకు పంపుతుందని మేం బావించడం లేదు. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షల నేపథ్యంలో ఏ దేశం కూడా రిస్క్ తీసుకోవడం లేదు. 16 దేశాల క్రికెట్ జట్లు ఆస్ట్రేలియా రావడంపై ఉన్న అవకాశాల్ని మేం పరిశీలిస్తున్నాం. నా అంచనా ప్రకారం.. ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ జరగడం చాలా చాలా కష్టం. అయితే.. అధికారికంగా ఇప్పటి వరకు టీ20 ప్రపంచకప్ రద్దు అవుతుందని, కానీ.. వాయిదా పడినట్లుగాని ప్రకటించలేదని ఎడ్డింగ్స్ అన్నారు. సీఏ(ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు) సీఈవో కెవిన్ రాబర్ట్స్ తన పదవికి రాజీనామా చేశారు. అతడి స్థానంలో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హాక్లీని తాత్కాలిక సీఈవో నియమిస్తున్నట్లు ఎర్ల్ ఎడ్లింగ్స్ తెలిపారు.
వాస్తవానికి మొన్న ఐసీసీ అన్ని సభ్య దేశాలు నిర్వహించిన సమావేశంలోనే టీ20 ప్రపంచకప్ వాయిదా గురించి ప్రకటిస్తారని అంతా బావించారు. అయితే.. ఆ సమావేశంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో వచ్చే నెలలో మరోసారి చర్చించి ఈ మెగా టోర్నీపై నిర్ణయం తీసుకుంటామని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రకటించిన సంగతి తెలిసిందే. పొట్టి ప్రపంచకప్ వాయిదా పడితే.. ఆ షెడ్యూల్‌లో ఐపీఎల్‌ను నిర్వహించాలని బీసీసీఐ బావిస్తోంది. ఐపీఎల్‌కు సిద్దంగా ఉండాలని ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలి అన్ని రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు లేఖ రాసిన విషయం తెలిసిందే.
అయితే.. అక్టోబర్‌లో భారత్‌లో వర్షాకాలం కావడంతో మ్యాచ్‌లకు ఆటంకం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఈ లీగ్‌ను విదేశాల్లో నిర్వహించే అవకాశాలను బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరీ ఐపీఎల్ పై మరింత క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగకతప్పదు.