కలర్ ఫుల్ కరోనా మాస్కులు.. ఇప్పుడిదే తాజా ఫ్యాషన్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Feb 2020 4:19 PM GMT
కలర్ ఫుల్ కరోనా మాస్కులు.. ఇప్పుడిదే తాజా ఫ్యాషన్

మనోళ్లున్నారే.. వీళ్లు దేన్నైనా ఫ్యాషన్ స్టేట్ మెంట్లుగా మార్చగలరు. ఫక్తు వామపక్ష చే గువేరా బొమ్మలున్న టీ షర్టుల్ని క్యాపిటలిస్టులు అమ్మేసేయగలరు. అలాగే కరోనా వైరస్ ను కూడా వ్యాపారంగా మార్చేశారు. కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకునేందుకు వాడే మాస్కులు కూడా ఇప్పుడు ఫ్యాషన్ సింబల్ గా మారిపోయాయి. డ్రస్సుకు మ్యాచింగ్ అయ్యే రంగుల్లో, డాట్లు, చుక్కలు... ఇలా అన్ని వెరైటీల్లో మాస్కులు వస్తున్నాయి. మామూలుగానే మన ఢిల్లీ వంటి నగరాల్లోనూ ఒక్కో బ్రాండ్ 12 వేల నుంచి 15 వేల వరకూ మాస్కులు అమ్ముతున్నాయి. ఒక్క కరోనాయే కాదు. ఢిల్లీలో కాలుష్యంనుంచి తప్పించుకునేందుకు కూడా ఈ మాస్కులు పనికొస్తున్నాయి. అందులో మంచి మాస్కులు 99.9 శాతం వరకూ కాలుష్యకారకాలను ఊపిరితిత్తుల్లోకి పోకుండా కాపాడతాయి. వీటిని ఎన్ 99 మాస్కులు అంటారు. వీటికి మంచి గిరాకీ ఉంది.

ఆలిండియా ఫుడ్ అండ్ డ్రగ్ లైసెన్స్ హోల్డర్స్ ఫౌండేషన్ వారందిస్తున్న వివరాల ప్రకారం ఢిల్లీలో నెలకు ఆరు నుంచి ఏడు లక్షల మాస్కులు అమ్మేవారు. ఇప్పుడు పది లక్షల నుంచి పదిహేను లక్షల మధ్యలో మాస్కులు ప్రతి నెలా అమ్ముడుపోతున్నాయి. ఏడాదికి రూ. 200 కోట్ల మేరకు జరిగే వ్యాపారం ఇప్పుడు ఏకంగా రూ. 450 కోట్లకు పెరిగింది.

ముఖ్యంగా విమాన ప్రయాణాలు చేసేవారు దేశ విదేశాలకు చెందిన వ్యక్తులకు దగ్గరగా ఉండాల్సి వస్తుంది. చేతుల కలపాల్సి వస్తుంది. విమానాశ్రయాల్లో వ్యాధిగ్రస్త ప్రాంతాలనుంచి వచ్చిన యాత్రికులు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అందుకే మాస్కులకు డిమాండ్ పెరిగింది. “నేను ఫలానా దేశానికి వెళ్తున్నాను. అక్కడ ఎలాంటి మాస్కులను ధరించాలి?” అని అడిగేవారు కూడా పెరుగుతున్నారు. ముఖ్యంగా థాయ్ లాండ్, ఇండోనీసియాలకు వెళ్లేవారు ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు. ముఖ్యంగా ఎన్ 99 మాస్కులు అసలు దుకాణాల్లో దొరకడం లేదు. కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు దేశవిదేశాలకు వెళ్తూ వస్తూ ఉంటారు. వాళ్లు ఈ మాస్కుల కోసం అడుగుతున్నారు.

పరిణితి చోప్రా, రణవీర్ సింగ్ వంటి సినీ ప్రముఖులు కూడా మాస్కులు వేసుకున్న ఫోటోలను ట్వీట్ చేచి, ఇన్ స్టాలో పెట్టి సందడి చేయడంతో ఇప్పుడు రోగం కూడా స్టైల్ పండుగ భోగంలా మారిపోయింది. రకరకాల ఫ్యాషన్ల మాస్కులు కొనుగోలు ఇప్పుడు ఫ్యాషన్ గా మారింది. కొందరైతే డ్రస్సులకు మ్యాచ్ అయ్యే మాస్కులు కొనుక్కుంటున్నారు.

Next Story