ముఖ్యాంశాలు

  • ఎయిర్‌ ఏషియా విమానానికి తప్పిన ప్రమాదం
  • టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే ల్యాండింగ్‌
  • విమానంలో వెస్ట్‌ బెంగాల్‌ మంత్రితో పాటు 171 మంది

వెస్ట్‌ బెంగాల్‌: ఎయిర్‌ ఏషియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది. బాగోగ్రాకు వెళ్లేందుకు టేకాఫ్‌ అయిన విమానం.. కొద్దిసేపటికే ఎమర్జెన్సీ కారణంగా తిరిగి ల్యాండ్‌ అయ్యింది. దీంతో భారీ ప్రమాదం తప్పినట్లైంది. కోల్‌కత్తాలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఎయిర్‌ ఏషియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయ్యింది. పైలట్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ నియంత్రణను సంప్రదించి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరాడు. గ్రీన్‌ సిగ్నల్‌ లభించడంతో వెంటనే విమానాన్ని సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. వెస్ట్‌ బెంగాల్‌ మంత్రి అరూప్‌ బిస్వాస్‌తో పాటు విమానంలో 171 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఎయిర్‌ పోర్టు నుంచి టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికి వడగండ్ల వర్షం కురిసింది. దీంతో పైలట్‌ వెంటనే అప్రమత్తమయ్యాడు. తిరిగి టేకాఫ్‌ తీసుకున్న ప్రదేశంలోనే విమానాన్ని ల్యాండింగ్‌ చేశాడు. విండ్‌ షీల్డ్‌కు నష్టం వాటిల్లిందనే అనుమానంతో పైలట్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన ఓ ప్రకటనలో సదరు విమానయాన సంస్థ ఈ విషయాన్ని తెలిపింది. ప్రయాణికుల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత ఆ విమాన సంస్థ పేర్కొంది. కలిగిన అసౌకర్యానికి తీవ్రంగా చింతిస్తున్నామని సదరు విమాన సంస్థ ముఖ్య భద్రతాధికారి తెలిపారు.

అంజి గోనె

Next Story