మంసాహారులెవ్వరో..శాఖాహారులెవ్వరో తెలియకుండా వడ్డిస్తే..నడ్డి విరుగుతుందని ఎయిరిండియాకు అర్ధమైంది. శాఖాహారులైన ప్రయాణికులకు మాంసాహారం వడ్డించినందుకు పంజాబ్ వినియోగదారుల ఫోరం ఏయిరిండియాకు రూ.47వేలు జరిమానా వేసింది.

మొహలికి చెందిన చంద్రమోహన్‌ పాఠక్‌ భార్యతో కలిసి ఎయిరిండియాలో చికాగో టికెట్ బుక్ చేసుకున్నాడు. జూన్‌17, 2016లో టికెట్ బుక్‌  చేశారు. మళ్లీ నవంబర్‌14న తిరుగు ప్రయాణం టికెట్ బుక్‌ చేసుకున్నారు చంద్రమోహన్ దంపతులు. టికెట్ బుకింగ్‌లో తాము శాఖాహరులమని స్పష్టం చేశారు.

చికాగో వెళ్లేటప్పుడు తమకు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదన్నారు చంద్రమోహన్ పాఠక్‌. కాని… ఢిల్లీకి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం విమాన సిబ్బంది తమకు మాంసాహారం భోజనం సర్వ్‌ చేశారని ఆరోపించాడు. ఆహార పొట్లాల మీద మాంసాహారం, శాఖాహారం అని తెలిపే గుర్తులు కూడా లేవన్నారు. దాంతో ఆగ్రహించిన చంద్రమోహన్‌ ఈ విషయం గురించి  పంజాబ్  వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు.

పాఠక్ చేసిన ఫిర్యాదు కు స్పందిస్తూ..చంద్రమోహన్‌కు రూ. 10 వేలు జరిమానాతో పాటు ..లీగల్‌ ఖర్చుల నిమిత్తం మరో ఏడు వేల రూపాయలు అదనంగా చెల్లించాలని ఎయిరిండియాను వినియోగదారుల ఫోరం కోర్ట్ ఆదేశించింది.

అయితే..ఎయిరిండియా సంస్థ వినియోగదారుల ఫోరం కోర్టు తీర్పును సవాలు చేయాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడువుగా ..రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కు వెళ్లింది. అక్కడ కూడా ఎయిరిండియాకు ఎదురు దెబ్బ తగిలింది. కమిషన్‌ , జరిమానా మొత్తాన్ని ఏకంగా నాలుగు రెట్లు పెంచి మొత్తం రూ. 47వేలు చెల్లించాల్సిందిగా ఆదేశించింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.