వ్యవసాయ విద్యుత్ కు మీటర్లు బిగిస్తే ఏం నష్టం, ఎవరికి నష్టం ?
By సుభాష్ Published on 6 Sep 2020 8:40 AM GMTఏపీ రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక అంశంపై వివాదం రేగాల్సిందే అన్నట్లుగా తయారైంది వ్యవహారం. తాజాగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించటమన్న ప్రభుత్వ నిర్ణయం లెటెస్టు వివాదం అయికూర్చుంది. అసలు వివిధ క్యాటగిరీల్లో ఎవరెంత విద్యుత్ వాడుతున్నామనే విషయంపై ప్రభుత్వం దగ్గర లెక్కలు లేకపోతే ఎలా ? ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 19 లక్షల వ్యవసాయ కనెక్షన్లున్నాయి. వీటి ద్వారా రైతులు ఎంత విద్యుత్ వాడుతున్నారనే విషయం ఏవో ఉజ్జాయింపుగా చెప్పే లెక్కలే తప్ప నిఖార్సయిన లెక్కలు లేవు. కచ్చితమైన లెక్కలు రావాలంటే ప్రతి కనెక్షన్ కు మీటర్లు బిగించాల్సిందే అన్న విషయం ప్రతి ఒక్కిరకి తెలుసు. మన ఇంటికైనా ఇదే విధానం, వ్యవసాయ కనెక్షన్ కైనా ఇదే విధానం.
ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని డిసైడ్ చేసింది. మీటర్లు బిగించటమంటే ఉచిత విద్యుత్ ను ఎత్తేస్తున్నట్లు కాదని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. మీటర్లు బిగించినట్లుగానే రైతుల పేర్లతో ఎస్క్రో ఖాతాలు తెరుస్తామని ఆ ఖాతాల్లో మీటర్ రీడింగ్ ప్రకారం డబ్బులు వేసి బిల్లులు చెల్లించేట్లు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అంటే ఇప్పటి పద్దతిలో అయినా మీటర్లు బిగించిన తర్వాతైనా విద్యుత్ వాడకానికి సంబంధించి రైతులైతే బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అంటే రైతుల ఉచిత విద్యుత్ పథకం కంటిన్యు అవుతుందనే ప్రభుత్వం చెబుతోంది. మరి ఇంతోటిదానికి చంద్రబాబునాయుడు మొదలు ప్రతిపక్షాలన్నీ ఎందుకింతగా వ్యతిరేకిస్తున్నాయో అర్ధం కావటం లేదు.
వ్యవసాయ కనెక్షన్లు మీటర్లంటు బిగిస్తే వ్యవసాయరంగంలో ఎంత విద్యుత్ వాడుతున్నది లెక్కలు తెలుస్తుంది. దాంతో పాటు ప్రభుత్వం ఎంత సబ్సిడి భరిస్తోందో కచ్చితమైన లెక్కలుంటాయి. పగటిపూటే తొమ్మిది గంటల నిరంత విద్యుత్ సరఫరాపై స్పష్టమైన అంచనాకు ప్రభుత్వం రావచ్చు. అంటే ఏ సమయంలో రైతులు ఎంత విద్యుత్ వాడుతున్నారనే విషయం తెలిసిపోతుంది.
ఈ వ్యవహారం సినిమా రిలీజ్ కాకముందే నా కథ కాపీ చేశారన్నట్టుంది. ప్రభుత్వం చెబుతున్నట్లుగా మీటర్లను బిగించి, అక్కౌంట్లో డబ్బులు వేయకపోతే రైతులే తిరగబడతారు. అపుడు వారికి మద్దతుగా నిలిస్తే ఉద్యమ రూపం దాలుస్తుంది. ఒకవేళ రైతులు దీనికి అనుకూలంగా ఉన్నారనుకో.... కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు బాబు కోరుకున్నది జగన్ హయాంలో అయిపోతుంది... అదేమీ అధికార పక్షానికి కొత్తగా ఓట్లు తెచ్చే పథకం కాదు. అలాంటపుడు తెలుగుదేశం నాయకత్వం ఆయాసపడటం వల్ల ప్రయోజనం ఏంటి? వాస్తవానికి చంద్రబాబు హయాంలోనే మీటర్లు పెడదామనుకున్నారు గానీ... రైతుల్లో వ్యతిరేకత వస్తుందేమో అన్న భయంతో చంద్రబాబు సర్కారు ఆలోచన విరమించుకుంది.