చైనాలో మళ్లి కరోనా కేసులు.. ఈసారి లక్షణాలు కనిపించకుండానే..!

By Newsmeter.Network  Published on  6 April 2020 10:46 AM GMT
చైనాలో మళ్లి కరోనా కేసులు.. ఈసారి లక్షణాలు కనిపించకుండానే..!

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. అగ్రరాజ్యాలు సైతం ఈ వైరస్‌ను అరికట్టలేక అతలాకుతలం అవుతున్నాయి. చైనాలో ప్రారంభమైన ఈ వైరస్‌ ఆదేశంలో అల్లకల్లోలం సృష్టించింది. కాగా అక్కడ వైరస్‌ వ్యాప్తి తగ్గింది. దీంతో గత నెల చివరి నుండే అక్కడ పాజిటివ్‌ కేసుల నమోదు భారీగా తగ్గింది. ఈ నేపథ్యంలో అక్కడ విధించిన ఆంక్షలను ప్రభుత్వం తొలగించింది. తాజాగా చైనాలో కరోనా వైరస్‌ కేసులు మళ్లి పెరుగుతున్నాయి. ఈసారి మాత్రం వ్యాధి నిర్ధారణ అవుతున్నప్పటికీ లక్షణాలు మాత్రం కనిపించటం లేదంట. దీంతో అక్కడి అధికారులు ఇదేంటి అంటూ తలలు పట్టుకుంటున్నారు.

Also Read :లాక్‌డౌన్‌ పొడగింపా? ఆంక్షలా?.. 9 తరువాత స్పష్టత వచ్చే అవకాశం..

గత మూడు నాలుగు రోజుల నుంచి చైనాలో కొత్తగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. శనివారం 30 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఆదివారం మరో 39 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. విచిత్రమేమిటంటే నిర్దారణ అయిన వ్యక్తుల్లో మాత్రం కరోనా లక్షణాలు బయటపడలేదని అధికారులు పేర్కొంటున్నారు. వ్యాధి లక్షణాలు కనిపించడకుండా ఈ మూడు రోజుల్లో 78 పాజిటివ్‌ కేసులు నిర్దారణ అయినట్లు చైనా జాతీయ ఆరోగ్య మిషన్‌ ప్రకటించింది. వీరందరిని ప్రత్యేక పరీక్షలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. చైనాలో మొత్తం 81,708 కరోనా కేసులు నమోదు కాగా 3,330 మంది మరణించారు. వైరస్‌ సోకిన వారిలో చికిత్స పొందుతూ 90శాతం మంది కోలుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే చైనా వెల్లడిస్తున్న పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్యపై ప్రపంచంలోని పలు దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఈ తరహా అనుమానాలు వ్యక్తం చేశారు. మరోవైపు ఇతర దేశాల్లోని పలువురుసైతం చైనా కరోనా కేసుల లెక్కలు దాస్తుందని విమర్శిస్తున్నారు.

Also Read :కొలంబియాలో వెరైటీగా లాక్‌ డౌన్‌.. ఆ నెంబర్లు వారే బయటకు రావాలి

Next Story