70 ఏళ్ల తరువాత మళ్లీ చిరుత.!

By అంజి  Published on  29 Jan 2020 7:03 AM GMT
70 ఏళ్ల తరువాత మళ్లీ చిరుత.!

చిరుత అంటే ఏమిటి అని మన కుర్రాళ్లను అడిగితే చటుక్కున “రామ్ చరణ్ తేజ్” అని చెప్పేస్తారు. ఎందుకంటే మనం మన దేశంలో అసలు చిరుతలను చూడలేదు. అసలు చిరుతలు శరవేగంగా పరుగు తీస్తాయి. వాటిని పట్టుకోవడం అసాధ్యం. క్షణాల్లో మాయమైపోతాయి. కానీ గత ఏడు దశాబ్దాలుగా చిరుతలే లేవు. ఎందుకంటే అంత శరవేగంగా పరుగులు తీసే జంతువులను కూడా మన రాజులు, మహారాజులు, బ్రిటిష్ అధికారులు పోటీపోటీగా వేటాడేశారు. దాంతో ఏడు దశాబ్దాల క్రితమే భారతీయ చిరుతలు అంతరించిపోయాయి.

అయితే ఇప్పుడు మళ్లీ మన దేశంలోకి చిరుతలు రాబోతున్నాయి. సుదూర ఆఫ్రికాకు చెందిన చిరుతలను మన దేశంలోని అడవుల్లో ప్రవేశపెట్టేందుకు సుప్రీం కోర్టు అనుమతినిచ్చింది. దీంతో మధ్యప్రదేశ్ లోని కునో పాల్పుర్ అభయారణ్యంలోకి చిరుతలను ప్రవేశపెట్టబోతున్నారు. నిజానికి ఆఫ్రికన్ చిరుత ప్రవేశం అంత ఆషామాషీగా జరగలేదు. మనుషులకు పాస్ పోర్టులు, వీసాలు ఉన్నట్టే దానికీ అనుమతులు, షరతులు కావలసి వచ్చాయి. విదేశీ జంతువును మన అడవుల్లో ప్రవేశపెడితే ఎలాంటి పరిణామాలుంటాయఓ అన్న సందేహంలో 2013 లో సుప్రీం కోర్టు అనుమతిని నిరాకరించింది. దాదాపు ఏడేళ్ల వేడుకోళ్ల తరువాత సుప్రీం కోర్టు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది. ప్రయోగాత్మకంగా కునో పాల్పుర్ అభయారణ్యంలోకి ప్రవేశపెట్టాల్సింది గా సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది.

చిట్ట చివరి చిరుతను 1947 లో వేటగాళ్లు హతమార్చారు. పులులు, సింహాలు ఇతర జంతువులు ఎలాగోలా బ్రతికి బట్టకట్టినా చిరుత మాత్రం కనుమరుగైంది. అందుకే చిరుతల సంతతిని మళ్లీ మన దేశంలో మూడు కానుపులు, ఆరు బిడ్డలుగా చేయాలని వన్యసంరక్షణ ఉద్యమకారులు కోరుతున్నారు. వారి కోరిక మేరకే ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది. ఈ ప్రయోగం సఫలమైతే పెద్ద సంఖ్యలో చిరుతలను అడవుల్లోకి వదిలే ఏర్పాట్లు చేస్తారు.

Next Story