పానీపూరి తిని 40 మంది చిన్నారులు అస్వస్థత

By సుభాష్  Published on  26 May 2020 10:59 AM GMT
పానీపూరి తిని 40 మంది చిన్నారులు అస్వస్థత

పానీపూరి 40 మంది చిన్నారులకు శాపంగా మారింది. ఆదిలాబాద్‌లో పానీపూరి తిన్న 40 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఈ ఘటనను బాలల హక్కుల సంఘం అత్యంత సీరియస్‌గా పరిగణించింది. మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇలా పానీపూరి బండిలు పెట్టుకుని నిర్వహించడం ద్వారా ఇలాంటి దారుణం చోటు చేసుకుందని పేర్కొంది. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. చిన్నారులకు మెరుగైన చికిత్స అందించేలా చర్యలు చేపట్టాలని కోరుతూ మానవ హక్కుల సంఘం పిటిషన్‌ దాఖలు చేసింది. వివరాల్లోకి వెళితే..

ఆదిలాబాద్‌ సిటీలోని ఖుర్షిద్‌నగర్, సుందరయ్య నగర్‌ కాలనీలకు చెందిన చిన్నారులు రోడ్డు పక్కనున్నఓ బండి వద్ద పానీపూరి తిని ఇంటికెళ్లారు. అనంతరం వారందరికి వాంతులు, విరేచనాలు అయి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఫుడ్‌ పాయిజన్‌ కావడంతో పానీపూరి తిన్న 40 మంది చిన్నారులను చికిత్స నిమిత్తం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. పానీపూరి తిన్న పిల్లలు 5 నుంచి 10 సంవత్సరాలలోపే ఉన్నారు. కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌లో ఉంటే ఆదిలాబాద్‌ సిటీలో పానీపూరిని ఎలా అమ్ముతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఇంత మంది పిల్లలు ఒకే సారి అస్వస్థతకు గురి కావడానికి గల కారణాలు ఏమిటని ఆరా తీయగా, పానీపూరి తిన్నవిషయం బయటపడింది. కాగా, పిల్లల ఆరోగ్యంపై ఎలాంటి ప్రమాదం లేదని రిమ్స్‌ వైద్యులు తెలిపారు. విషయం తెలుకున్న బంధువులు రిమ్స్‌కు చేరుఉని పరామర్శిస్తున్నారు. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. తినుబండారాలను విక్రయించేందుకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేసింది.

Next Story