దారుణం: తల్లిపైనే పెట్రోల్‌ పోసి నిప్పంటించిన కసాయి కొడుకు

By సుభాష్  Published on  13 May 2020 9:15 AM GMT
దారుణం: తల్లిపైనే పెట్రోల్‌ పోసి నిప్పంటించిన కసాయి కొడుకు

తల్లిపైనే పెట్రోల్‌ పోసి నిప్పటించాడు ఓ కసాయి కొడుకు. ఈ దారుణ సంఘటన ఆదిలాబాద్‌ జిల్లాఆ జైనథ్‌ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడ్డెర కాలనీకి చెందిన ర్యాపని లసుంబాయి (60)కి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. ఆరోగ్యంతో భర్త చనిపోవడంతో ఆమె ఒంటరిగా ఉంటోంది. అయితే ఆమెకున్న ఐదు ఎకరాల భూమిని ఇతరులకు కౌలుకు ఇస్తూ వచ్చిన డబ్బులతోనే జీవనం కొనసాగిస్తోంది.

ఇక కౌలు డబ్బులను చూసిన పెద్ద కొడుకు నాందేవ్‌కు మింగుడు పడలేదు. తరచూ తల్లితో గొడవపడేవాడు. ఈ ఏడాది కూడా లసుంబాయి భూమిని ఓ వ్యక్తికి కౌలుకు ఇవ్వగా, అతడు కొంత మొత్తాన్ని ఇచ్చాడు. దీంతో నాందేవ్‌ ఫుల్లుగా మద్యం తాగి ఇంటికొచ్చి తల్లితో గొడవకు దిగాడు. డబ్బులు ఇవ్వాలని తల్లితో పట్టుబట్టాడు. డబ్బులు మాత్రం ఇవ్వనని తేల్చి చెప్పింది. దీంతో భర్త దీపికను బెదిరించి పెట్రోల్‌ తెప్పించిన నాందేవ్‌ తల్లిపై పోసి నిప్పటించాడు. అక్కడే ఉన్న ఆమె కూతురు, చిన్న కోడలు గమనించి చుట్టుపక్కల వాళ్ల సాయంతో మంటలను ఆర్పివేశారు.

వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కూతురు శాంత ఫిర్యాదు మేరకు నాందేవ్‌, అతని భార్య దీపికపై 307 సెక్షన్‌ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story
Share it