ఎన్టీఆర్ గతం తెలిసి ఏడ్చేశా.. నన్ను హింసించకండి ప్లీజ్
By తోట వంశీ కుమార్ Published on 30 Jun 2020 3:24 PM ISTయంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు మద్దుతుగా మాట్లాడినందుకు తనని బెదరిస్తున్నారని నటి పాయల్ ఘోష్ ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.దీంతో నెపోటిజంపై ఆగ్రహా జ్వాలలు రగులుతున్నాయి. దీనిపై ఇప్పటికే చాలా మంది స్పందించారు. ప్రతిభ ఉన్న నటులను పక్కన పెట్టి వారసత్వం నుంచి వచ్చిన నటులకు అవకాశాలు ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌కు మద్దతిస్తూ రంగంలోకి దిగిన పాయల్ ఘోష్‌కి సోషల్ మీడియా నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అయితే, అతడికి తానెందుకు మద్దతు ఇస్తున్నానన్న విషయం ఎప్పటికీ అర్థం చేసుకోలేరని పాయల్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. బెదిరింపుల కారణంగా తాను డైరెక్ట్ మెసేజ్ ఆప్షన్ తొలగించినట్టు పాయల్ పేర్కొన్నారు. తారక్ కూడా సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చారంటూ తనకు మెసేజ్‌లు వస్తున్నాయని, అయితే, సినిమా కోసం ఆయన పడే కష్టం మరెవరికీ తెలియదని అన్నారు.
నన్ను బెదిరించడం కొంతమందికి ఒక క్రేజ్‌లా ఉంది. నేను తారక్‌కు మద్దతుగా నిలబడటం వెనుక అసలు కారణం మీరెప్పటికి అర్థం చేసుకోలేరు. ఆయన పట్ల కాస్త జాలి చూపండి. ఆయన గతం గురించి తెలిసి నాకు కన్నీళ్లు ఆగలేదు. ఏడ్చేశాను. ఇక చాలు ఆపండి. ఎన్టీఆర్‌ను చూసి గర్వపడండి అంటూ పాయల్ ట్వీట్ చేసింది.
తాను ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్నానన్న పాయల్.. దయ చేసి సోషల్ మీడియా వేదికగా తనని తిట్టడం ఆపాలని కోరారు. పాయల్ ఘోష్ తెలుగులో ప్రయాణం, ఊసరవెల్లి చిత్రాల్లో నటించింది.