సీనియర్ యాక్టర్ కళ్యాణి కెరీర్ లో మరో ట్విస్టు

By సుభాష్  Published on  10 March 2020 1:14 PM GMT
సీనియర్ యాక్టర్ కళ్యాణి కెరీర్ లో మరో ట్విస్టు

సీనియర్ యాక్టర్ కళ్యాణి.. ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో మంచి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా మారారు. పలు సినిమాల్లో ఆమె నటిస్తూ మెప్పించారు. కళ్యాణి కెరీర్ ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఫిలిం సర్కిల్స్ లో కళ్యాణిని కావేరీ అని కూడా అంటారు. ఇప్పుడు ఆమె మెగా ఫోన్ పట్టుకోబోతున్నారు. దర్శకురాలిగా మారబోతున్నారు.

సైకలాజికల్ లవ్ థ్రిల్లర్ సినిమాకు ఆమె దర్శకురాలిగా మారిపోయారు. తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కబోతున్న ఈ సినిమా నిజ జీవితాల ఆధారంగా తెరకెక్కబోతోందని తెలుస్తోంది. దర్శకత్వంతో పాటు కళ్యాణి ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించబోతున్నారు. తన సొంత బ్యానర్ అయినటువంటి కె2కె ప్రొడక్షన్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

కళ్యాణి రాజశేఖర్ హీరోగా నటించిన 'శేషు' సినిమా ద్వారా తెలుగులో అరంగేట్రం చేశారు. రవితేజతో కలిసి నటించిన 'అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' సినిమాకు ఆమె మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఆ సినిమాకు గానూ ఉత్తమనటిగా నంది అవార్డును కూడా అందుకున్నారు. పెళ్ళాంతో పనేంటి, వసంతం, కబడ్డీ-కబడ్డీ, దొంగోడు, పెదబాబు సినిమాల్లో ఆమె నటించారు. హీరోయిన్ గా అవకాశాలు తగ్గాక పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు కళ్యాణి. ఇప్పుడు ఆమె మెగా ఫోన్ పట్టబోతున్నారు.

ఆమె రూపొందించబోయే సినిమాకు సంబంధించిన ప్రీ-లుక్ టీజర్ కు సంబంధించిన అప్డేట్ ను దర్శకుడు పూరీ జగన్నాథ్ హొలీ సందర్భంగా విడుదల చేశారు. సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలోనే మొదలుకాబోతోంది. చేతన్ చీను, సిద్ధి, సుహాసిని మణిరత్నం, రోహిత్ మురళి, శ్వేత కీలక పాత్రల్లో నటించబోతున్నారు. 1986 లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేశారు హీరోయిన్ కళ్యాణి. అప్పట్లోనే మళయాళం సినిమాలో నటించి మెప్పించారు. చివరిసారిగా విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన టాక్సీ వాలా సినిమాలో నటించారు.

Next Story
Share it