లాక్ డౌన్ మనకేమీ కొత్త కాదంటున్న రాజేంద్రప్రసాద్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Jun 2020 9:10 AM GMT
లాక్ డౌన్ మనకేమీ కొత్త కాదంటున్న రాజేంద్రప్రసాద్

లాక్ డౌన్..మార్చి 23వ తేదీ నుంచి మొదలైన ఈ లాక్ డౌన్ నాలుగు దశల వారీగా మే 31వ తేదీ వరకూ కొనసాగింది. ఐదో విడత లాక్ డౌన్ ను మాత్రం కేవలం కంటైన్మెంట్ జోన్లకే పరిమితం చేశారు. కొన్ని రాష్ట్రాలు అంతర్రాష్ట్ర రవాణాను కూడా మొదలుపెట్టాయి. ఇక త్వరలోనే దశలవారిగా సినీ, సీరియల్, రియాలిటీ షోల షూటింగులు కూడా ప్రారంభమవ్వనున్నాయి. కాగా..ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హాస్యనటుడు, నటశిరోమణి రాజేంద్రప్రసాద్ లాక్ డౌన్ పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

లాక్ డౌన్ మనకేమీ కొత్త కాదన్నారు రాజేంద్రప్రసాద్. కరోనా వల్ల పెట్టిన లాక్ డౌన్ లో కొంతమంది తప్ప..మనమంతా ఇళ్లలోనే ఉన్నాం. కానీ త్రేతాయుగానికెళ్తే.. తండ్రి మాటకు తలొంచి వనవాసం చేసిన సీతారాములకు ఇలాంటి సౌకర్యాలేమీ లేవు. నిజానికి రాముడు పడిన కష్టాలు మనమెవ్వరం చూడలేదన్నారు. అలాగే పాండవులు కూడా అజ్ఞాతవాసం చేశారు. నిజానికి అదే అసలు సిసలైన లాక్ డౌన్ అన్నారు. కరోనా వైరస్ ను జయించాలంటే లాక్ డౌన్ ఒక్కటే మనముందున్న పరిష్కారం కాబట్టే..రెండు నెలలపాటు ఇళ్లకే పరిమితమవ్వాల్సి వచ్చిందన్నారు. లాక్ డౌన్ తర్వాత తనను కలిసిన వారంతా ఎలా ఉన్నారని అడిగారని చెప్పుకొచ్చారు.

లాక్ డౌన్ లో అందరం ఇళ్లలోనే ఉన్నాం.. నిజానికి మామూలు రోజుల్లో కంటే లాక్ డౌన్ లో ఇంట్లోనే చాలా బాగున్నామన్నారు. ఎప్పుడూ షూటింగులతో, ఉద్యోగాలతో బిజీగా ఉండే వారికి ఈ సమయంలో తమ కుటుంబాలతో కలిసి సమయాన్నిగడిపే అవకాశం వచ్చిందన్నారు. ముఖ్యంగా పిల్లలకు తల్లిదండ్రులను మరింత దగ్గర చేసింది లాక్ డౌన్ అన్నారు రాజేంద్రప్రసాద్. కానీ..స్వగ్రామాలకు వెళ్లేందుకు వలసకూలీలు పడినపాట్లు, కొందరు మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోవడం తనను చాలా కలచివేసిందన్నారు.

Next Story