ఎడారిలో చిక్కుకున్న స్టార్ హీరో.. సాయం చేయాల‌ని ప్ర‌భుత్వానికి లేఖ‌

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 1 April 2020 8:40 PM IST

ఎడారిలో చిక్కుకున్న స్టార్ హీరో.. సాయం చేయాల‌ని ప్ర‌భుత్వానికి లేఖ‌

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. క‌రోనా దెబ్బ‌కి అన్ని రంగాలు కుదేల‌య్యాయి. క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌భుత్వం 21 రోజుల పాటు లాక్‌డౌన్ ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్‌కు అన్ని రంగాల వారు మ‌ద్ద‌తు ఇస్తున్నారు. ప్ర‌జ‌లు కూడా ఇళ్లు దాటి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. కాగా.. ఇలాంటి కష్ట కాలంలోనూ ఓ టీమ్ త‌మ సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లి అక్కడ ఇరుక్కుపోయింది.

బ్లెస్సీ ద‌ర్శ‌కత్వంలో మల్లూవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ హీరోగా "ఆడుజీవితం" అనే సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ప్ర‌స్తుతం జోర్డాన్‌లో జ‌రుగుతోంది. అయితే క‌రోన వైర‌స్ ముప్పుతో చిత్రీక‌ర‌ణ నిలిపివేయాల‌ని అక్క‌డి అధికారులు చిత్ర‌బృందాన్ని ఆదేశించారు. దీంతో చేసేది లేక చిత్ర షూటింగ్‌ను నిలిపివేశారు. అయితే అక్క‌డి నుంచి భార‌త్ కు వ‌చ్చి మ‌ళ్లి వెళ్ల‌డం అంటే.. మాట‌లు కాదు. చిత్ర నిర్మాత‌కు ఖ‌ర్చు త‌డిసిపోతోంద‌ని బావించిన చిత్ర యూనిట్ కొద్ది రోజులు త‌రువాత షూటింగ్ చేయ‌వచ్చున‌ని అక్క‌డే ఉండిపోయింది. మొదట ఏప్రిల్ 10 వ‌ర‌కు షూటింగ్ చేసుకోవడానికి జోర్డాన్ అధికారుల నుంచి ప‌ర్మిష‌న్ తీసుకున్నారు. క‌రోనా ముప్పు నేప‌థ్యంలో ప‌ర్మిష‌న్‌ను క్యాన్సిల్ చేశారు. దీంతో 58 మంది స‌భ్యులు గ‌ల చిత్ర బృందం జోర్డాన్ ఎడారిలో చిక్కుకుపోయారు.

దీంతో.. మాకు సాయం చేయాలంటూ.. దర్శకుడు బ్లెస్సీ కేరళ ప్రభుత్వానికి, ఫిల్మ్ ఛాంబర్‌కు లేఖ రాశాడు. తినడానికి తిండి తాగడానికి నీరు అందుబాటులో లేవని, కేర‌ళ‌కు తిరిగి వ‌ద్దామ‌న్నా విమానాల రాక‌పోక‌లు నిలిచిపోయాయని వాపోయాడు. ప్ర‌భుత్వ సాయం లేనిదే కేర‌ళ‌కు రావ‌డం దాదాపు అసాధ్య‌మ‌ని వాపోయాడు. తాజాగా హీరో పృథ్వీరాజ్ కూడా ఓ లెటర్ సోషల్ మీడియాలో షేర్ చేసాడు.



Next Story