5000 సంవత్సరాల కిందటి రహస్యాలను చూపించబోతున్నాం: నిఖిల్

By సుభాష్  Published on  10 March 2020 1:41 PM GMT
5000 సంవత్సరాల కిందటి రహస్యాలను చూపించబోతున్నాం: నిఖిల్

హీరో నిఖిల్ పెళ్లికి ఇంకా నెల రోజులు కూడా సమయం లేదు. భీమవరంకు చెందిన అమ్మాయి డాక్టర్ పల్లవి వర్మను నిఖిల్ అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. కానీ నిఖిల్ మాత్రం తన పెళ్లికి, పెళ్లయ్యాక హనీమూన్ కు పెద్దగా సమయం కేటాయించలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు. అందుకు కారణం సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండడమే..!

2014 లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన మిస్టరీ థ్రిల్లర్ 'కార్తికేయ'కు సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు నిఖిల్. ఓ వైపు పెళ్లి పనుల్లో, మరోవైపు షూటింగ్ తో తాను చాలా బిజీగా ఉన్నానని.. సినిమాను పూర్తీ చేయడమే తన ముందు ఉన్న కర్తవ్యమని నిఖిల్ అంటున్నాడు. సినిమాను ఎలాగైనా దసరాకు విడుదల చేయాలని అనుకుంటున్నామని.. కానీ సమయం మాత్రం చాలా తక్కువగా ఉన్నట్లు నిఖిల్ చెప్పుకొచ్చాడు. రాబోయే రెండు నెలలు చాలా.. చాలా బిజీగా గడపబోతున్నానని మాత్రం తనకు ముందుగానే అర్థమవుతోందని నిఖిల్ తెలిపాడు. అలాగే తన హనీమూన్ ను కూడా పోస్ట్ పోన్ చేసుకున్నామని అంటున్నాడు. సినిమా షూటింగ్ పూర్తయ్యాకనే తాను హనీమూన్ కు వెళ్ళబోతున్నానని.. షూటింగ్ కు కూడా కేవలం ఒకటి రెండు రోజులు మాత్రమే గ్యాప్ ఇచ్చి పెళ్లి చేసుకోబోతున్నానని తెలిపాడు.

ఈ హ్యాపీడేస్ స్టార్ హీరోయిన్ స్వాతి రెడ్డి, డైరెక్టర్ చందూ మొండేటితో మరోసారి కలిసి పని చేయనున్నాడు. వీరి కాంబినేషన్ లోనే 'కార్తికేయ' తెరకెక్కడం.. నిఖిల్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవ్వడం తెలిసిందే. ఈ మధ్యనే సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు. అది బాగా వైరల్ అయిందని.. ఆరేళ్ళ కిందట విడుదలైన సినిమాను ప్రేక్షకులు ఇంకా మరచిపోలేదని ఆనందం వ్యక్తం చేసాడు నిఖిల్. హైదరాబాద్ లో గత కొద్దిరోజులుగా కార్తికేయ-2 షూటింగ్ కొనసాగుతోంది. ఓ వైపు షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు పెళ్ళికి సంబంధించిన షాపింగ్ లో నిఖిల్ నిమగ్నమైపోయాడు.

కారికేయ మొదటి భాగంలో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి ఒక సంవత్సరం తర్వాత 'కార్తికేయ 2' కథ మొదలవ్వనుంది. మొదటి పార్ట్ లో హీరోయిన్ గా చేసిన స్వాతి తన పాత్రలో కనిపిస్తుందని.. కథ కోసం ఇంకో హీరోయిన్ ను తీసుకున్నట్లు కూడా నిఖిల్ తెలిపాడు. కొత్త హీరోయిన్ కు సంబంధించిన వివరాలు అతి త్వరలో తెలియజేయనున్నారు. తన క్యారెక్టర్ ఈ భాగంలో ముందు కంటే ఎక్కువ సమస్యలపై పోరాటం చేయబోతోందని తెలిపాడు. ఆరు నెలల పాటూ రీసర్చ్ చేసి సినిమాకు సంబంధించిన స్క్రిప్టును పూర్తీ చేశామని నిఖిల్ అంటున్నాడు. కాంచీపురం లోని వరదరాజ పెరుమాళ్ గుడి, గుజరాత్ లోని ద్వారక గుడి, కోణార్క్ సూర్య దేవాలయం, కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయాలను దర్శించి అక్కడి కొన్ని విషయాలను తెలుసుకున్నామన్నాడు. వేదాలను కూడా తాము చదివామని.. కార్తికేయ-2 మైథలాజికల్ గా గత సినిమా కంటే మిన్నగా తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని.. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు నిఖిల్. మన కల్చర్, చరిత్రలను మరచిపోతున్నామని.. 5000 కిందటి రహస్యాలను ఈ సినిమాలో చూపించబోతున్నామని నిఖిల్ తెలిపాడు. కార్తికేయలో సుబ్రమణ్యస్వామి గురించి చూపించగా.. ఈ సినిమా శ్రీకృష్ణుడి చుట్టూ తిరుగుతుందట.

నిఖిల్ ఏప్రిల్ 16న మూడుముళ్లు వేయనున్నాడు. ఓ వైపు సినిమా షూటింగ్, మరోవైపు పెళ్లి పనులతో ఈ మధ్య చాలా బిజీ అయిపోయాడు. సినిమా షూటింగ్ పూర్తయ్యాకనే హనీమూన్ కు వెళ్లాలని తామిద్దరం అనుకున్నామని నిఖిల్ అంటున్నాడు.

Next Story
Share it