మహారాష్ట్రలోదారుణం చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు ఓ యువతిపై యాసిడ్‌ పోసి దాడికి తెగబడ్డారు. గోండియా ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ దాడిలో యువతి తీవ్రంగా గాయపడటంతో స్పందించిన పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 20 ఏళ్ల యువతి నాగ్‌పూర్‌లోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో చదువుకుంటోంది. ఆమె కళాశాలకు వెళ్తుండగా, ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు ఆమెపై యాసిడ్‌ పోసి దాడికి దిగారు. ఆ తర్వాత ఆ యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి యువతిని ఆస్పత్రికి తరలించారు. కాగా, కొన్ని రోజులుగా ఆ ఇద్దరు యువకులు వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

యువతి ప్రతి రోజు కాలేజీ వెళ్తుండగా, కొన్ని రోజులు నుంచి ఆ ఇద్దరు యువకులు ఆమెను అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఇలాంటి ఘటనలపై పోలీసులు ఎన్నో చర్యలు చేపడుతున్నా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా కఠిన చర్యలు చేపట్టేందుకు చట్టాలు తీసుకువచ్చాయి. అయినా ఇలాంటి మృగాళ్ల తీరు ఏ మాత్రం మారడం లేదు. ఇప్పటికే ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసు గాని, హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటనలు సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. ఇలాంటి ఘటన నేపథ్యంలో పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించినా కామాంధుల ఒంట్లో ఏ మాత్రం భయం కనిపించడం లేదు.

కాగా, ప్రభుత్వాలు కూడా ఎన్నో కఠిన చట్టాలు అందుబాటులోకి తీసుకువచ్చినా, అధికారుల నిర్లక్ష్యం కారణంగా అది నీరుగారిపోతోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.  దేశంలో అత్యాచారాలు, హత్యలు, యాసిడ్‌ దాడులు చేసిన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించకపోవడం ఒక కారణమైతే , వారిని పట్టుకుని కోర్టు విచారణల పేరుతో సంవత్సరాల విచారణలు జరుపుతూ ఎలాంటి శిక్ష వేయకపోవడం, మళ్లీ వారిని విడుదల చేయడం వల్ల కూడా ఇలాంటి మృగాళ్లకు భయం అనేది లేకుండా పోతుందని కూడా పలువురు ఆరోపిస్తున్నారు. ఇలాంటి కేసులు జరిగితే వెంటనే ఫాస్ట్‌ ట్రాక్‌ ఏర్పాటు చేసి నిందితులను తక్షణమే శిక్ష అమలు చేస్తే, తర్వాత ఇలాంటి దారులణాలకు చెక్‌ పెట్టవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.