పిల్లల్ని బంధించి.. ప్రాణాలు కోల్పోయాడు

By సుభాష్  Published on  31 Jan 2020 3:48 AM GMT
పిల్లల్ని బంధించి.. ప్రాణాలు కోల్పోయాడు

తన ఇంట్లో పుట్టినరోజు పార్టీ ఉందని చుట్టుపక్కల పిల్లలు, మహిళలను పిలిచి నిర్బంధించి కలకలం సృష్టించిన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు మట్టు పెట్టారు. సుమారు 8 గంటలపాటు అత్యంత ఉత్కంఠతో జరిగిన ఈ ఆపరేషన్లో వేరే అవకాశం లేక పోలీసులు నిందితున్ని కాల్చి చంపారు. సంఘటన వివరాల్లోకి వెళితే..

గురువారం యూపీలోని ఫరూఖాబాద్ జిల్లా, కఠారియా గ్రామంలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది.. మర్డర్ కేసులో బెయిలుపై విడుదలైన సుభాష్​బాథమ్ అనే నేరస్తుడు 20 మంది పిల్లలను, మహిళలను బందీలుగా పట్టుకున్నడు. కూతురు బర్త్ డే అని చెప్పి ఇంటికి పిలిచిన అతడు.. వాళ్లు లోపలికి రాగానే తుపాకీతో బెదిరించి లాక్ చేశాడు. సుభాష్ చేసిన పనికి నిర్ఘాంతపోయిన ఇరుగుపొరుగు వారు ఆ ఇంటి తలుపులు పగలగొట్టి చిన్నారులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, ఇంటి లోపలి నుంచి సుభాష్ గన్‌తో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒకరు గాయపడ్డారు. కాల్పులు జరపడమే కాకుండా తక్కువ ప్రభావం గల ఓ బాంబును కిటికీలో నుంచి విసిరాడు. తన మీద తప్పుడు కేసులు పెట్టారంటూ ఆ కిటికీలో నుంచి గట్టిగా అరిచాడు. పోలీసులు సుభాష్ కు రకరకాలుగా నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అతడి బంధువులు, గ్రామ పెద్దలను రంగంలోకి దించినప్పటికీ ఫలితం లేకపోయింది. విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. పిల్లలను కాపాడేందుకు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ టీం రంగంలోకి దిగింది. సుమారు 8 గంటలపాటు ప్రయత్నించిన పోలీసులు గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగుడిని కాల్చి చంపారు. అనంతరం పిల్లలందర్ని ఆ ఇంటి నుంచి సురక్షితంగా బయటకుతీసుకొచ్చారు. ఈ ఘటన నుంచి చిన్నారుల క్షేమంగా బయటపడడంతో వారి తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.Next Story
Share it