విచారణను మలుపు తప్పిన డైరీ!

By సుభాష్  Published on  6 March 2020 8:41 AM GMT
విచారణను మలుపు తప్పిన డైరీ!

ముఖ్యాంశాలు

  • డైరీలో రాసింది సత్యనారాయణరెడ్డేనా?

  • సత్యనారాయణరెడ్డి కుటుంబం మృతి విచారణలో కొత్త మలుపు

గత నెల 17న కరీంనగర్‌ జిల్లా కాకతీయ కాలువలో కారు పడి ముగ్గురు జలసమాది అయిన విషయం విధితమే. కాల్వలో పడిన 20రోజుల తరువాత కారుతో పాటు అందులోని సత్యనారాయణ రెడ్డి, రాధ, వినయశ్రీ ముగ్గురు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు అందరూ హైదరాబాద్‌ నుంచి కారులో వస్తుంటే అదుపు తప్పి కారు కాల్వలోకి దూసుకెళ్లి ఉంటుందని భావిస్తూ వచ్చారు. కానీ పోలీసులు విచారణ వేగవంతం అవుతున్నా కొద్దీ కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పోలీసులకు దొరిన డైరీ.. కేసును కొత్త మలుపు తిప్పినట్లయింది. దీంతో వీరిది ఆత్మహత్యనా అనే అనుమానాలకు బలాన్ని చేకూర్చుతున్నారు..

పూర్తి వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌కు చెందిన సత్యనారాయణరెడ్డి, రాధా దంపతులు. వీరికి వినయ్‌ శ్రీ అనే కుమార్తె ఉంది. గతంలో వీరి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి మృతిచెందారు. సత్యనారాయణరెడ్డి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి బావ. కరీంనగర్‌ వాస్తవ్యుడైన సత్యనారాయణరెడ్డి ఎరువుల వ్యాపారి. సాయి తిరుమల ఆగ్రో ఏజెన్సీస్‌ షాపు ద్వారా ఎరువులను విక్రయిస్తుంటారు. కాగా ఇటీవల కుటుంబ సభ్యులు ముగ్గురు హైదరాబాద్‌ నుంచి కారులో తిరిగి వస్తుండగా కరీంనగర్‌ శివారులోని కాకతీయ కాల్వలో పడి జలసమాధి అయ్యారు. 20రోజుల తరువాత వీరి మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో పోలీసులు కేసు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా పలువురిని విచారించిన పోలీసులు వీరిది కారు ప్రమాదంగానే భావిస్తూ వచ్చారు. కేసు విచారణ వేగం పుంజుకొనే సరికి కొత్త విషయాలు వెలుగులోకి వస్తుండటంతో పోలీసులు అన్నికోణాల్లో దర్యాప్తును ప్రారంభించారు.

విచారణను మలుపు తప్పిన డైరీ..

పోలీసుల విచారణ వేగం పుంజుకుంటున్న తరుణంలో ఓ డైరీ పోలీసుల విచారణ స్వరూపాన్నే మలుపు తప్పింది. సత్యనారాయణరెడ్డి నిర్వహిస్తున్న సాయి తిరుమల ఆగ్రో ఏజెన్సీస్‌ షాపులో సత్యనారాయణ రెడ్డి రాసినట్లుగా ఓ డైరీ లభ్యమైనట్లు తెలుస్తుంది. ఈ డైరీలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ డైరీలో జీవితం మీద విరక్తి చెందేలా మాటలు ఉండటంతో పాటు తన మరణానంతరం ఆస్తిని తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగించాలని, తమ ఎరువుల దుకాణాన్ని కుటుంబానికి నమ్మకంగా పనిచేస్తున్న గుమ్మస్తా నర్సింగ్‌కు ఇవ్వాలని ప్రస్తావన ఉండటంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలీసులు చేతిరాత సత్యనారాయణరెడ్డిదేనా అని తెలుసుకొనేందుకు హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించినట్లు తెలిసింది. దీంతో ఇప్పటి వరకు వీరిది కారు ప్రమాదమే అని కేసు విచారణ సాగిస్తున్న పోలీసులు డైరీ లభ్యమవ్వటంతో కేసు విచారణనను ఆత్మహత్య కోణంలోనూ కొనసాగిస్తున్నారు.

ఇన్నాళ్లు డైరీ ఏమైంది..?

సత్యనారాయణరెడ్డి కుటుంబ సభ్యులు జనవరి 27న కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌ బయలు దేరి దగ్గర నుండి ఎరువుల దుకాణాన్ని గుమ్మస్తా నర్సింగే చూసుకుంటున్నాడు. పోలీసుల తనిఖీలో లభ్యమైన డైరీ.. ఇన్నాళ్లు నర్సింగ్‌కు కనిపించలేదా అనేదానిపైనా పోలీసులు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. మరోవైపు సత్యనారాయణరెడ్డి హైదరాబాద్‌కు బయలుదేరే ముందురోజు గుమ్మస్తా నర్సింగ్‌కు రూ.2లక్షలు అప్పగించినట్లు తెలుస్తోంది. సత్యనారాయణరెడ్డి మరణవార్త తెలిసిన నర్సింగ్‌ ఆ రూ. రెండు లక్షలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరోవైపు సత్యనారాయణరెడ్డి కుటుంబానికి నర్సింగ్‌ నమ్మకంగా పనిచేశాడని బంధువులు, సత్యనారాయణరెడ్డి స్నేహితులు చెబుతున్నారు. ఇన్ని విషయాల నడుమ పోలీసులు అన్ని కోణాల్లో విచారణను ముమ్మరం చేశారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించిన డైరీలో రాత సత్యనారాయణరెడ్డిదేనా.. మరొకరిదా అనే విషయం స్పష్టమైతే కానీ విచారణలో స్పష్టత వస్తుందని ఓ పోలీస్‌ అధికారులు పేర్కొనడం గమనార్హం.

Next Story
Share it