అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థులపై అదనపు డీసీపీ ఓవర్‌యాక్షన్‌..

By అంజి  Published on  11 March 2020 7:48 AM GMT
అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థులపై అదనపు డీసీపీ ఓవర్‌యాక్షన్‌..

ముఖ్యాంశాలు

  • ఏబీవీపీ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ
  • విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసన
  • అసెంబ్లీ ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తల యత్నం

హైదరాబాద్‌: విద్యారంగంపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు రాష్ట్ర అసెంబ్లీని ముట్టడించారు. కాగా పోలీసులు వారిని అడ్డుకొని చెదరగొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీని వెంటనే చేపట్టాలని విద్యార్థి నాయకులు డిమాండ్‌ చేశారు. బడ్జెట్‌లో విద్యకు సంబంధించి సరైన కేటాయింపులు చేయలేదని విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీవీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. తాము విద్యార్థులమని.. దొంగలం కాదని.. పోలీసులు ఇంత దౌర్జన్యం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని విద్యార్థులు మండిపడ్డారు.

ఈ క్రమంలో అసెంబ్లీ గేట్‌ ఎక్కిన విద్యార్థిని అదనపు డీసీపీ గంగిరెడ్డి లాఠీతో చితకబాదాడు. దీంతో అడ్డుకోబోయిన మరో విద్యార్థి చెంప చెల్లుమనిపించాడు. కాగా అదనపు డీసీపీ ప్రవర్తనపై ఏబీవీపీ విద్యార్థులు తీవ్ర అసహననానికి గురయ్యారు. గంగిరెడ్డి ఓవర్‌ యాక్షన్‌పై విద్యార్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నారని సమాచారం.

అసెంబ్లీ మెయిన్‌ గేట్‌కు పోలీసులు లాక్‌ వేశారు. అయిన కూడా విద్యార్థులు గేట్‌ ఎక్కి లోపలికి చొచ్చుకేళ్లే ప్రయత్నం చేశారు. విద్యార్థులను, ఏబీవీపీ కార్యకర్తలను కట్టడి చేసేందుకు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. కేజీ టు పీజీ ఫీజుల దోపిడీని అరికట్టాలని, కఠినమైన ఫీజుల నియంత్రణ చట్టం తేవాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఎయిడెడ్‌ కాలేజీలను ప్రభుత్వపరం చేయాలని విజ్ఞప్తి చేశారు. గత హామీకి అనుగుణంగా రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

కాగా ఏబీవీపీ, పీడీఎస్‌యూ అసెంబ్లీ ముట్టడిలో పోలీసులు వైఫల్యం చెందినట్టుగా తెలుస్తోంది. పోలీసుల, ఇంటెలిజెన్స్‌ వైఫల్యంపై ఉన్నతాధికారులు సీరియస్‌ అయ్యారని సమాచారం. నిన్న అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చి రద్దు చేసుకున్నట్లు విద్యార్థి సంఘాలు ప్రచారం చేసుకున్నాయి. పోలీసుల కన్నుకప్పి విద్యార్థి సంఘాల కార్యకర్తలు అసెంబ్లీని ముట్టడించాయి. ఏబీవీపీ విద్యార్థుల వ్యూహాన్ని పోలీసులు కనిపెట్టలేకపోయారు. కాగా పలువురు పోలీసులపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏబీవీపీ విద్యార్థులపై లాఠీ చార్జ్‌ని ఖండించిన ఎంపీ బండి సంజయ్‌

విద్యారంగ సమస్యలను పరిష్కరించమంటే ఇష్టం వచ్చినట్టు పోలీసులతో చితకబాదిస్తారా? ఇచ్చిన హామీలు నిలుపుకోమని, సమస్యలు పరిష్కరించమని అడిగితే తప్పా..? అంటూ బండి సంజయ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వాళ్ల విద్యార్థులనుకున్నారా.. లేక సంఘ విద్రోహశక్తులనుకుంటున్నారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు ఉద్యోగాల్లేవు.. ఏమీ లేవని అంటారా అంటూ ఎంపీ బండి సంజయ్‌ ఫైర్ అయ్యారు. ఏబీవీపీ విద్యార్థులపై లాఠీచార్జ్‌ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థి ఉద్యమాలను అణిచివేసే ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుందో సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసునన్నారు. విద్యార్థులు తిరబడితే ఏం జరుగుతుందో త్వరలోనే పాలకులు చూస్తారని ఎంపీ బండి సంజయ్‌ అన్నారు.

Next Story