3 లక్షలు దాటిన కరోనా కేసులు

By అంజి  Published on  23 March 2020 7:53 AM GMT
3 లక్షలు దాటిన కరోనా కేసులు

ముఖ్యాంశాలు

  • ప్రపంచ వ్యాప్తంగా 14 వేలు దాటిన కరోనా మరణాలు
  • ఇటలీలో 5500 పైగా మృతులు
  • అంతా ఐక్యమైనా భయపడని కరోనా బూచి
  • ఇంకా ఎన్నాళ్లీ అవస్థలు
  • ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దెబ్బకొట్టిన కరోన

కరోనా బూచిని తరిమికొట్టేందుకు యావత్ భారతం ఏకమైంది. అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అయినా వైరస్ దేశంలో రెండవ దశలోనే ఉంది. కేవలం ఒక్కరోజు స్వీయ నిర్భంధంతో కరోనా బూచిని కట్టడి చేయలేమని గ్రహించిన కేంద్రం లాక్ డౌన్ ప్రకటించింది. చాలా రాష్ట్రాల్లో 144 సెక్షన్ అమలులో ఉంది. ఇతర రాష్ట్రాల సంగతేమో గానీ మనవాళ్లు మాత్రం నిబంధనలు బేఖాతరు చేసి..ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం నుంచి కఠినమైన నిబంధనలను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. అత్యవసరమైతే తప్ప బయట తిరగరాదని హెచ్చరించారు. వచ్చే 10-15 రోజుల్లో కనీస జాగ్రత్తలను పాటించకపోతే రాష్ట్రంలో కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తుందన్నారు. అలాగే సెలవులిచ్చారు కదా అని ఎవ్వరూ సొంత ఊర్లకు పయనమవ్వరాదని తెలిపారు. ఎవరి ఇళ్లకు వారు పరిమిత మవ్వాలని సూచించారు. అలాగే ప్రతిరోజూ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ ఎవరూ బయటికి రాకూడదని హెచ్చరించారు. కాదని ఎవరైనా బయట తిరిగితే..భారీ జరిమానాలు, క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు.

ఇక ప్రపంచ వ్యాప్తంగా 3 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 14 వేల మందికి పైగా మరణించగా..ఎక్కువగా ఇటలీలో 5500 మందికి పైగా మరణించడం ప్రపంచాన్ని కలవరపెట్టే విషయం. ఇప్పటికే భారత్ ఇటలీకి మాస్క్ లు, ఇతర వైద్య పరికరాలను ఇచ్చి సహాయం చేసింది. కొంతమంది కోటీశ్వరులు విరాళాలను ప్రకటించారు. ఇటలీలో ప్రజల పరిస్థితిని చూసి ఆ దేశ అధ్యక్షుడు సైతం కంటతడి పెట్టుకున్నారు. అత్యల్ప జనాభా ఉన్న దేశంలో వైరస్ ఈ స్థాయిలో ప్రభావం చూపిస్తుండటంతో ఇతర దేశాలు భయపడుతున్నారు. మొత్తం 200 దేశాలకు వైరస్ విస్తరించినట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

Also Read: బీ సీరియస్‌.. బయటకు వస్తే కఠిన చర్యలు

కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి బాగా దెబ్బ తగలింది. వేల లక్షల కోట్ల ఆదాయానికి కరోనా గండి కొట్టింది. స్టాక్ మార్కెట్లు ప్రారంభంలోనే భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. వారంలో ఒక్కసారి లాభాలు గడిస్తే..మిగిలిన అన్ని రోజులు దానికి నాలుగింతల నష్టాలను భరించాల్సిన పరిస్థితి. దీంతో మదుపరులు షేర్లు కొనేందుకు, అమ్మేందుకు ఒకటి 10 సార్లు ఆలోచించాల్సి వస్తోంది.

మరో నెలరోజుల పాటు కనీస జాగ్రత్తలు పాటిస్తే తప్ప కరోనా అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినట్లు వీలైనంతవరకూ ఇళ్లకే పరిమితమైతే మంచిది. కాదని బయట తిరిగితే కరోనా బూచి నుంచి ఎవరూ కాపాడలేరు.

Next Story