'అబార్షన్' రూల్ మార్పు చేస్తున్న‌ కేంద్రం.. ఇక నుండి..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Jan 2020 11:58 AM GMT
అబార్షన్ రూల్ మార్పు చేస్తున్న‌ కేంద్రం.. ఇక నుండి..

అబార్షన్ల చ‌ట్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ(MTP) యాక్ట్ – 1971ను సవరించ‌నుంది. ఈ విష‌య‌మై MTP చ‌ట్టం కోసం రూపొందించిన సవరణ బిల్లును బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ మేర‌కు జనవరి 31 నుంచి ప్రారంభ‌మ‌య్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తోంది.

ఈ చ‌ట్టం ద్వారా మాతృ మరణాల సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో పాటు అక్రమ అబార్షన్లు త‌గ్గుతాయ‌ని కేంద్రం తెలిపింది. అంత‌కుముందు MTP చట్టం 1971 ప్రకారం ఓ మ‌హిళ‌ గర్భం దాల్చిన నాటి నుంచి 20 వారాల వరకు అబార్షన్ చేయించుకునే అవకాశం ఉంది. అయితే.. ఈ గడువును 24 వారాలకు పెంచుతూ కేంద్ర ప్ర‌భుత్వం చట్ట సవరణ చేసేందుకు నిర్ణయించింది. గ‌ర్భ‌ధార‌ణ‌ విషయంలో తల్లి హక్కులను కాపాడేందుకు ఈ గడువు పెంచుతున్నట్లు కేంద్రం తెలిపింది. మాతృ మరణాల రేటును తగ్గించడంతో పాటు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని కేంద్ర కేబినెట్ అభిప్రాయపడింది.

Next Story