మహిళా ఎమ్మార్వో సజీవ దహనం, పీఎస్ లో లొంగిపోయిన దుండగుడు..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Nov 2019 3:12 PM IST
హైదరాబాద్ :అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ కార్యాలయంలో దారుణం జరిగింది. తహశీల్దార్ విజయపై యువ రైతు వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తహశీల్దార్ విజయ అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెను కాపాడబోయిన పలువురికి గాయాలయ్యాయి. సురేష్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.లంచం అడిగినందుకు తహసీల్దార్ విజయపై యువ రైతు సురేష్ పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు సమాచారం. తహశీల్దార్ వేధింపులు తట్టుకోలేకనే యువ రైతు సురేష్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
మధ్యాహ్న భోజన విరామ సమయంలో దుండగుడు తహసీల్దార్ ఛాంబర్‌లోకి వెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ దుండగుడు కూడా తనకు తాను నిప్పంటించుకున్నాడు. తహసీల్దార్‌ను కాపాడే యత్నంలో మరో ఇద్దరు సిబ్బందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన తహసీల్దార్ డ్రైవర్‌తో పాటు.. మరో వ్యక్తిని హయత్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. ఘటన అనంతరం దుండగుడు కాలిన గాయాలతో బయటకు పరుగులు తీసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఏర్పడిన తర్వాత విజయారెడ్డి తొలి తహసీల్దార్‌గా నియమితులయ్యారు. ఈ ఘటనకు భూ వివాదమే కారణమై ఉంటుందని భావిస్తున్నారు.
ఘటన తరువాత నిందితుడు సురేష్ పీఎస్‌కు వెళ్లి లొంగిపోయాడు. హత్యకు గల కారణాలపై సురేష్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. పొలం రిజిస్ట్రేషన్ విషయంలో విజయారెడ్డి వేధించారని సురేష్ ఆరోపించినట్లు తెలుస్తోంది. పొలం రిజిస్ట్రేషన్ చేసేందుకు విజయ లంచం అడగడం వలనే చంపానని సురేష్ చెప్పినట్లు సమాచారం.
విజయా రెడ్డి డ్రైవర్ గురునాదం 90% కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. ప్యూన్ చంద్రయ్యకు కూడా గాయాలయ్యాయి. మృతురాలు విజయారెడ్డి స్వస్థలం నల్లగొండ జిల్లా నకరికల్. భర్త సుభాష్ రెడ్డి హయత్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో లెక్చరర్. విజయ- సుభాష్ రెడ్డి దంపతులకు ఒక బాబు, ఒక పాప.
ప్రత్యక్ష సాక్షి
ఒకరు లోపలికి వెళ్లాడు. తరువాత గది లాక్ చేశాడు. మేడం మీద కిరోసిన్ పోశాడు. అటెండర్ మేడంను బయటకు లాగాడు. వాడు మేడం జుట్టు పట్టుకున్నాడు. మేడం కిందపడి పోయింది. నేను మేడంను పట్టుకోబోయి కిందపడ్డాను. నాకు మంటలు అంటాయి. వాడు బయటకు ఉరికాడు. ఘటన జరిగినప్పుడు నేను బయట ఉన్నాను.
ప్రత్యక్ష సాక్షి
కొన్ని సెకన్లలోనే మేడం సజీవ దహనం అయ్యారు. చూడలేక..ముక్కు మూసుకుని బయటకు ఉరికాను. గ్యాస్ పేలినట్లు సౌండ్ వచ్చింది. నేను చాలా భయపడ్డాను.
ఘటనను ఖండించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో సజీవదహనం ఘటన చాలా బాధాకరం. ఈ ఘటనను ఖండిస్తున్నాం. అధికారులు కూడా ప్రజల కోసమే పని చేస్తుంటారు.ఎమ్మార్వోతో ఇబ్బంది ఉంటే పై అధికారులకు చెప్పాలి. ఇటువంటి దుర్మార్గమైన పద్ధతి కరక్ట్ కాదు. ఎందుకు ఎమ్మార్వోను చంపాల్సి వచ్చిందనేది ..విచారణకు ఆదేశించాం.
ఘటనాస్థలానికి చేరుకున్న విజయారెడ్డి తల్లిదండ్రులు
విజయారెడ్డి ఫ్యామిలీ ఫొటో