షేక్‌హ్యాండ్ ఇవ్వబోయాడు.. కరోనా గుర్తొచ్చి..
By తోట వంశీ కుమార్ Published on 13 March 2020 3:47 PM ISTకరోనా వైరస్(కొవిడ్-19) ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. వైరస్ ప్రభావం క్రీడలకు తాకిందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇప్పటికే ఈ మహమ్మారి ధాటికి పలు క్రీడలు రద్దు అయ్యాయి. స్టేడియంలోకి అభిమానులను అనుమతించకుండా కొన్ని క్రీడలను నిర్వహిస్తున్నారు. తాజాగా శుక్రవారం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే జరుగుతోంది. కరోనా భయంతో అభిమానులను స్టేడియంలోకి అనుమతించలేదు.
ఇదిలా ఉండగా.. కరోనా భయంతో ఇప్పటికే అన్ని జట్లు తమ క్రీడాకారులకు కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలను సూచించాయి. అందులో భాగంగా మ్యాచ్ మొదలైన, లేదా ముగిసిన అనంతరం ఇతర జట్లలోని ఆటగాళ్లతో షేక్‌హ్యాండ్స్ ఇవ్వకూడదు. కాగా.. ఆస్ట్రేలియా, కివీస్‌ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టాస్ వేసిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో టాస్ వేసిన తర్వాత ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్, కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. అయితే వెంటనే ఫించ్ తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. తరువాత ఇరు జట్ల కెప్టెన్లు ఒకరిముఖాలను మరొకరు చూసుకుని నవ్వుకున్నారు. తరువాత కేన్ విలియమ్సన్, ఫించ్‌లు తమ మోచేతులతో ట్యాప్ చేసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) తన ట్విట్టర్ ఎకౌంట్‌లో పోస్టు చేసింది. 'క్రికెట్‌లో హ్యాండ్ షేక్ బాగా అలవాటైపోయింది.. ఇప్పుడు మోచేతితో అంటే కష్టమే' అని క్యాప్షన్ పెట్టింది. ఇదిలా ఉండగా.. మ్యాచ్ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా బౌలర్ కేన్ రిచర్డ్‌సన్ కరోనా సోకిందనే అనుమానం రావడంతో మ్యాచ్ నుంచి తప్పించారు. ప్రస్తుతం రిచర్డ్‌సన్‌కు కోవిడ్‌కు సంబంధించిన టెస్టులు పూర్తి చేశామని, వాటి రిపోర్ట్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.