ఆధార్‌ నోటీసుల వ్యవహారం.. వెలుగులోకి సంచలన నిజాలు

By అంజి  Published on  20 Feb 2020 8:08 AM GMT
ఆధార్‌ నోటీసుల వ్యవహారం.. వెలుగులోకి సంచలన నిజాలు

హైదరాబాద్‌: ఆధార్‌ నోటీసుల వ్యవహారంలో సంచలన అంశాలు బయటకు వస్తున్నాయి. తమ పౌరసత్వం నిరూపించుకోవాలంటూ ఆధార్‌ సంస్థ 127 మందికి నోటీసులు జారీ చేసింది. అందులో ఒకడైన సత్తార్‌ ఖాన్‌ 2018లో రోహింగ్య ముస్లింలకు నకిలీ పత్రాలు సృష్టించి ఆధార్‌ కార్డులు ఇప్పించినట్లు సైబర్ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పాతబస్తీలో పలువురు బ్రోకర్లతో కలిసి నకిలీ పత్రాలు సృష్టించి 127 మంది రోహింగ్యాలకు ఆధార్‌ కార్డులు ఇప్పించినట్లు బట్టబయలైంది. విచారణలో భాగంగా ఆధార్‌ సంస్థకు రాష్ట్ర పోలీసులు లేఖ రాశారు.

పోలీసులు రాసిన లేఖపై ఆధార్‌ సంస్థ స్పందించింది. ఆ 127 మంది రోహింగ్యాలకు నోటీసులు జారీ చేసింది. సరైన పత్రాలతో తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆధార్‌ సంస్థ నోటీసుల్లో పేర్కొంది. నోటీసులు అందుకున్న 127 మందిలో భారతదేశ పౌరులు అయితే ఖచ్చితంగా సరైన పత్రాలు చూపించాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఇతర దేశం నుంచి వచ్చినట్టు ఆధారాలు చూపించాలని నోటీసులో ఆధార్‌ అధికారులు పేర్కొన్నారు. ఏ పత్రాలు లేకుంటే తమ ఆధార్‌ కార్డులను రద్దు చేస్తామని ఆధార్‌ అధికారులు స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే నోటీసులు అందుకున్న వారు తమ ధృవపత్రాల సమర్పణకు ఇచ్చిన గడువును పొడిగించినట్లు UIDAI తెలిపింది. నోటీసులు అందుకున్న వారిలో ముగ్గురు భారతీయులు, 124 మంది రోహింగ్యాలు ఉన్నట్లు సమాచారం. ధ్రువ పత్రాల సమర్పణ గడువును మే నెల వరకు పొడిగించారు. నోటీసులు అందుకున్న వ్యక్తులు మాత్రం ఇది చట్టం వ్యతిరేకమని అంటున్నారు. ఆధార్‌కార్డు జారీ సమయంలోనే అన్ని ఆధారాలు తీసుకున్నారని చెబుతున్నారు.

ఆధార్‌ జారీ సమయంలో ధ్రువ పత్రాల పరిశీలన మరింత సునిశీతంగా చేపట్టాలని UIDAI సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం UIDAIకి క్షేత్రస్థాయిలో ధ్రువ పత్రాలను పరిశీలించే వ్యవస్థ లేదు. దీంతో కొందరు అక్రమంగా ఆధార్‌కార్డులు పొందుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

పలువురికి నోటీసులు జారీ చేయడంపై UIDAIని ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ తప్పుబట్టారు. UIDAI సంస్థ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, ప్రజలను భయాందోళనకు గురి చేస్తోందని వారు అన్నారు. ఆ 127 మంది జాబితాలో ఎంత మంది దళితులు, ముస్లింలు ఉన్నారో బయటపెట్టాలని అసదుద్దీన్‌ డిమాండ్‌ చేశారు.

Next Story