మట్టికుండలో దొరికిన పాప.!

By Medi Samrat  Published on  15 Oct 2019 9:44 AM GMT
మట్టికుండలో దొరికిన పాప.!

బిడ్డని కోల్పోయిన ఆ తల్లిదండ్రుల దగ్గరకు మరో బిడ్డ వెతుక్కుంటూ వచ్చినట్టయ్యింది. జనక మహారాజుకి భూమిని దున్నుతుండగా సీతమ్మ దొరికినట్టు, హితేష్ కు పాతిపెట్టిన మట్టి కుండలో ఒక పాప దొరికింది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన హితేష్, వైశాలి దంపతులకు ఏడాది క్రితం వివాహమైంది. 7 నెలల గర్భిణి అయిన వైశాలి చనిపోయిన బిడ్డకు జన్మనిచ్చింది.

అయితే.. దేహాన్ని పూడ్చి పెట్టేందుకు స్మశాన వాటికకు వెళ్లిన వారికి అక్కడ తవ్వుతుండగా ఒక మట్టి కుండ బయటపడింది. గుడ్డ కట్టిన ఆ మట్టికుండను విప్పిచూసిన హితేష్ ఆశ్చర్యపోయాడు. కొండలో సజీవంగా ఉన్న పాపను చూసి అంబులెన్స్ కు, పోలీసులకు సమాచారం అందించాడు.

ఆక్సిజన్ లేకపోవడంతో పాపకు శ్వాసలో ఇబ్బందులు తలెత్తాయి. ఊపిరితిత్తులలో కాస్త ఇన్ఫెక్షన్ కూడా చేరడంతో డాక్టర్లు ఆ పాపకు చికిత్సను అందిస్తున్నారు. పాప ప్రిమెచ్యూర్ బేబీ అయ్యుంటుందని.. అటువంటి బేబీల‌కు ఆక్సిజన్ కాస్త తక్కువ అవసరం ఉంటుంది కాబట్టి పాప ఇంకా సజీవంగా ఉందన్నారు. కుండలో పాతి పెట్టిన కారణంగా రంధ్రాల ద్వారా ఆమెకి కాస్తయినా ఆక్సిజన్ అంది ఉంటుందని దానితోనే పాప ప్రాణాలు నిలుపుకున్నాద అని డాక్టర్లు చెబుతున్నారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాపను సజీవంగా పాతి పెట్టిన వారి గురించి ఆరా తీస్తున్నారు. బిడ్డను కోల్పోయిన బాధలో ఉన్న హితేష్, వైశాలి దంపతులు ఈ పాపను తమ జీవితంలోకి స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో అధికారులు ఇతర ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

Next Story