మిలటరీ జాగిలానికి సీనియర్ అధికారి వందనం..!

By Newsmeter.Network  Published on  17 Dec 2019 2:52 AM GMT
మిలటరీ జాగిలానికి సీనియర్ అధికారి వందనం..!

ఒక భారతీయ సైనికాధికారి, ఒక పోలీస్ జాగిలం ఎదురైతే పరస్పర అభివాదాలు చేసుకునే సన్నివేశాన్ని మీరు ఎప్పుడైనా చూసారా. అలాంటి ఒక ఫోటో ఇప్పుడు వైరల్ అయ్యింది. లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ థిల్లాన్‌కు మిలటరీ జాగిలమైన మేనకవందనం చేస్తుండగా, దానికి ప్రతిగా కమాండర్ శాల్యూట్ చేసిన చిత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒక అగ్రశ్రేణి ఆర్మీ కమాండర్ ఒక మిలటరీ జాగిలానికి శాల్యూట్ చేసిన చిత్రం నెటిజన్ల హృదయాన్ని హత్తుకుంది.

ఇంతకీ ఈ ఫోటో వెనుకనున్న కథేమిటంటే..

ఇటీవల వెటర్నరీ కార్ప్స్‌ డే సందర్భంగా ఓ వ్యక్తి ఈ ఫోటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. దానికి సైనికాధికారి ధిల్లాన్‌ స్పందించారు. ఎంతోమందిని ప్రాణాలు కాపాడిన మేనకకు ఆర్‌వీసీ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అని రీట్వీట్‌ చేశారు. దీనితో అందరికీ ఈ ఫోటో గురించి వివరాలు తెలుసుకోవాలన్న ఉత్సాహం పెరిగింది. .



చూడటానికి పెంపుడు కుక్కలా ఉన్న ఈ పోలీస్ జాగిలం పేరు మేనక. జులై 1న లెఫ్టినెంట్‌ జనరల్‌ ధిల్లాన్‌ అమర్‌నాథ్ యాత్ర సందర్శనకు వెళ్లారు. మందిరానికి 50 మీటర్ల ముందు మేనక విధులు నిర్వర్తిస్తోంది. అది గమనించిన సైనికాధికారి ధిల్లాన్‌ మేనక వద్దకు వెళ్లగానే అది ఆయనను గుర్తించి గౌరవపూర్వకంగా రెండు కాళ్ళు ఎత్తి మిలటరీ సెల్యూట్ చేసింది. అయితే భారత సైనిక సంప్రదాయం ప్రకారం సీనియర్ మిలటరీ అధికారులందరూ పరస్పరం వందనం చేసుకోవాలి. అందుకే లెఫ్టినెంట్ జనరల్ కమాండర్ థిల్లాన్ తోపాటు అందరు అధికారులు మిలటరీ జాగిలమైన మేనకకు శాల్యూట్ చేశారు.



సైన్యంలో వివిధ కార్యకలాపాల సమయంలో మిలటరీ జాగిలాలు వివిధ దళాలతో పాటు వచ్చి విధులు నిర్వర్తిస్తుంటాయి. ఉగ్రవాదులను, పేలుడు పదార్థాలను గుర్తించడంలో ఈ జాగిలాలు సైన్యానికి సహాయపడతుంటాయి. ఉగ్రవాదుల ఆట కట్టించడంలో సహాయపడిన పలు మిలటరీ జాగిలాలకు పతకాలు కూడా ప్రదానం చేస్తుంటారు.

Next Story