ప్రస్తుతం కరోనా వైరస్ విషయంలో ప్రతి ఒక్కరూ ఎంతో అప్రమత్తంగా ఉన్నారు. ఎప్పుడు ఏమవుతుందా అని ప్రజలు తెగ టెన్షన్ పడుతూ ఉన్నారు. ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ లక్షణాలతో ఎవరు ఆసుపత్రుల్లో చేరుతున్నా ఆసుపత్రుల్లోని మిగతా పేషెంట్లు కూడా భయపడుతూ ఉన్నారు. కొందరైతే కరోనా వైరస్ లక్షణాలతో వచ్చిన రోగులకు భయపడి ఆసుపత్రుల నుండి పారిపోతూ ఉన్నారు. ఇలాంటి ఘటన వికారాబాద్ లో చోటుచేసుకుంది.

వికారాబాద్ టీబీ ఆసుపత్రి నుండి శనివారం నాడు నలుగురు టీబీ పేషెంట్స్ చెప్పా పెట్టకుండా వెళ్లిపోయారు. కోవిద్-19 బారిన పడిన కొందరు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారనే వార్తలు విన్న ఆ పేషెంట్స్ ఆసుపత్రి నుండి వెళ్లిపోయారు. ఆసుపత్రిలో 29 మంది టీబీ పేషెంట్స్ చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆసుపత్రిలో విపరీతంగా పరిశుభ్రతకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. కొత్తగా పేషెంట్స్ వచ్చి చేరుతూ ఉన్నారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులను, అక్కడ ఉంచిన వైద్య పరికరాలను చూడడానికి పెద్ద ఎత్తున అధికారులు అక్కడికి వస్తూ ఉండడంతో టీబీ పేషెంట్స్ కాస్తా టెన్షన్ పడ్డారు. వీరిలో నలుగురు పేషెంట్స్ అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆసుపత్రి అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే వెళ్లిపోయారట.

ఇక ఆసుపత్రిలోని మెడికల్ స్టాఫ్ కు శానిటైజర్లూ, మాస్కులు కూడా ఇవ్వకపోవడం విమర్శలకు దారితీస్తోంది. అంతేకాకుండా కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న వారితో ఎలా మసులుకోవాలో కనీస ట్రైనింగ్ ఇవ్వలేదట. వేరే చోటు నుండి మరికొందరు స్టాఫ్ ను ఈ ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. గాంధీ ఆసుపత్రిలో ఇప్పటికే పేషెంట్స్ సంఖ్య అధికంగా ఉండడంతో ఈ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో అన్ని సదుపాయాలూ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచనలు వచ్చాయి.

శనివారం దాదాపు మూడు గంటల పాటు క్యాబినెట్ సహచరులతో సమావేశమైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రజలు భయాందోళనలకు గురి కావద్దని సూచించారు. కొన్ని సూచనలు పాటిస్తే ఈ మహమ్మారి మన దరిచేరదని ఆయన చెప్పుకొచ్చారు.  ఈ వ్యాధి భారత్ లోనో, తెలంగాణలోనో పుట్టినది కాదని విదేశాల నుంచి వస్తున్న వ్యాధి కాబట్టి దేశీయంగా ప్రమాదం లేదని భరోసా ఇచ్చారు. విమానాశ్రయాలు, నౌకాశ్రయాల వద్దే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. కరోనా గ్రామీణ ప్రాంతాలకు సోకే అవకాశమే లేదని, ఈ విషయంలో తనది భరోసా అని అన్నారు.

కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలుతీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఇందుకోసం రెండుదశల కార్యక్రమాలను చేపట్టాలని క్యాబినెట్‌ నిర్ణయించిందని కేసీఆర్ వెల్లడించారు. 15 రోజుల్లోగా.. వారం రోజుల యాక్షన్‌ ప్లాన్‌తో ముందుకెళ్తామన్నారు సీఎం కేసీఆర్‌. ఏడు రోజులవారీగా కార్యక్రమాలు నిర్ణయించామని తెలిపారు. మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. సినిమాహాళ్లు, బార్లు, పబ్‌లు, మెంబర్‌షిప్‌ క్లబ్‌లు మూసివేస్తున్నట్లు చెప్పారు. బహిరంగసభలు, సమావేశాలు, సదస్సులు, వర్క్‌షాప్‌లు, ఉత్సవాలు, ర్యాలీలు, ఎగ్జిబిషన్లు, ట్రేడ్‌ ఫెయిర్లు, సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతులివ్వబోమని చెప్పారు.

నిత్యావసర వస్తువులకు ఇబ్బంది కలుగకుండా మాల్స్‌, సూపర్‌మార్కెట్లను మూసివేయడంలేదని.. అలాంటి చోట్ల ఎక్కువ సేపు ఉండకుండా వీలైనంత తొందరగా పని చూసుకుని వెళ్లాలని సూచించారు. విద్యాసంస్థలు మూసివేస్తున్నామని.. బోర్డు పరీక్షలు మాత్రం యథాతథంగా జరుగుతాయని అన్నారు. పరీక్షలు రాస్తున్న వాళ్లకు సంక్షేమహాస్టళ్లలో వసతి సౌకర్యం కొనసాగుతుందని అన్నారు. ఇండోర్‌, అవుట్‌డోర్‌ స్టేడియంలు, స్విమ్మింగ్‌పూల్స్‌, జిమ్‌లు, జిమ్నాజియంలు, జూపార్కు, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, మ్యూజియంలలో జనసమూహం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వాటిని మూసి వేస్తున్నట్లు తెలిపారు. ప్రజారవాణాకు ఇబ్బంది కలుగకుండా బస్సులు, రైళ్లు నడుస్తాయని.. వాటిలో నిరంతరం శానిటేషన్‌ పనులు చేపడ్తామని ఆయన అన్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.