కరీంనగర్‌లో కరోనా కలకలం.. రంగంలోకి 100 ప్రత్యేక బృందాలు
By అంజి Published on 19 March 2020 3:19 AM GMTతెలంగాణలో కరోన వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే ఏకంగా 8 మందికి కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. అయితే వీరిలో ఏడుగురు ఇండోనేషియాకు చెందిన వారు కాగా, ఇంకో వ్యక్తి ఇటీవల స్కాట్లాండ్ నుంచి మేడ్చల్ వాసి. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 13కు చేరకుంది.
ఇక కరీంనగర్ జిల్లాకు కరోనా భయం పట్టుకుంది. ఇండోనేషియాకు చెందిని 10 మంది వ్యక్తులు ఇటీవల కరీంనగర్‌లో పర్యటించారు. అయితే అందులోని వ్యక్తికి మంగళవారం రోజున కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో మిగతా తొమ్మిది కరోనా పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. విషయం తెలిసిన కరీంనగర్ జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. వెంటనే ప్రభుత్వ వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఇండోనేషియా వాసులు పర్యటించిన ప్రాంతాలపై అధికారులు దృష్టి సారించారు. వారు ఎవరెవరిని కలిశాడు. ఎక్కడెక్కడ తిరిగారు అన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఇక వారు తిరిగిన ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. 100 ప్రత్యేక వైద్య బృందాలతో ఇంటింటికి వెళ్లి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇండోనేషియా బృందంలో 8 మంది కరోనా బారిన పడగా, మరో ఇద్దరు ఇండోనేషియా వాసులు, వారితో పాటుగా వచ్చిన యూపీకి చెందిన వ్యక్తికి కరోనా సోకలేదని వెల్లడైంది.
స్కాట్లాండ్‌లో బీబీఏ చదువుతున్న మేడ్చల్ జిల్లాకు చెందిన యువకుడు ఈ నెల 16న శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. ఆ రోజు మొత్తం కూడా కుటుంబ సభ్యులతోనే ఉన్నాడు. ఆ తర్వాత రోజు తీవ్ర జ్వరం రావడంతో గాంధీ ఆస్పత్రిలో చేరగా, వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా పాజిటివ్ అని తేల్చారు. ఇక శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అంబులెన్స్ వాహనాలను పెంచారు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులందరినీ అక్కడి నుంచి నేరుగా క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. దూలపల్లిలోని ఐసోలేషన్ కేంద్రానికి బుధవారం నాటికి 102 మంది తరలించారు. కాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో మరో 5 ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం అధికారులు తగిన భవనాలను సైతం గుర్తించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు నిన్న వచ్చిన 1500 మందిని క్వారంటైన్‌కు తరలించారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సామూహికంగ జరిగే ఉత్సవాలకు, కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు. ప్రజలు గూమి గూడే కార్యక్రమాలన్నింటీని రద్దు చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ స్వీయ ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకోవాలని, వైరస్ లక్షణాలు ఉంటే ప్రభుత్వానికి సమాచారం అందించాలన్నారు.