కాకినాడ‌లో ఏడేళ్ల బాలిక కిడ్నాప్‌...బ‌య‌ట‌ప‌డ్డ అస‌లు నిజం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Nov 2019 6:51 AM GMT
కాకినాడ‌లో ఏడేళ్ల బాలిక కిడ్నాప్‌...బ‌య‌ట‌ప‌డ్డ అస‌లు నిజం

కాకినాడలో కిడ్నాపైన ఏడేళ్ల బాలిక దీప్తిశ్రీ కేసు మిస్టరీగా మారింది. సూరాడ దీప్తిశ్రీ అనే బాలిక‌ తాను చదువుకునే పాఠ‌శాల నుంచి శుక్రవారం కిడ్నాప్‌కు గురైంది. ఈ విష‌యమై బాలిక తండ్రి సత్యశ్యామ్‌కుమార్‌ కాకినాడ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాకినాడ -యానాం రోడ్డులో పగడాల పేటకు చెందిన శ్యామ్‌కుమార్‌ భార్య సత్యవేణి గ‌త కొన్ని రోజుల క్రితం మృతి చెందింది. కొంతకాలం త‌ర్వాత సత్యశ్యామ్‌కుమార్‌ శాంతి కుమారి అనే మ‌హిళ‌ను రెండోపెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం దీప్తిశ్రీ స్థానిక నేతాజీ పార్కు వద్దఉన్న నగర పాలక సంస్థ ప్రాధమిక పాఠశాలలో రెండో తరగతి చ‌దువుకుంటోంది. బాలిక శుక్రవారం పాఠ‌శాల‌కు వెళ్లిన బాలిక‌ను మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఓ మహిళ వచ్చి దీప్తిశ్రీని పాఠశాల నుంచి బయటకు తీసుకువచ్చి వేరే వ్యక్తి ద్విచ‌క్ర వాహ‌నం మీద ఎక్కించుకుని తీసుకువెళ్లినట్లు సత్యశ్యామ్‌కుమార్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. శాంతికుమారికి తన కుమార్తె అంటే ఇష్టం లేదని, అందుకు ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డి ఉంటుంద‌ని ఆయ‌న‌ ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. దీనిపై వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా కిడ్నాప్‌ చేసిన వ్యక్తులు బాలికను చంపివేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇక బాలిక కిడ్నాప్ విష‌య‌మై రంగంలోకి దిగిన పోలీసులు పాప సవతి తల్లి శాంతికుమారిని అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో పోలీసులకు పొంత‌న‌లేని స‌మాధానాలు చెప్ప‌డంతో పోలీసులు త‌మ‌దైన శైలిలో గ‌ట్టిగా ప్ర‌శ్నించారు. వెంట‌నే శాంతికుమారి అస‌లు నిజాన్ని చెప్పేసింది. బాలిక‌ను తానే కిడ్నాప్ చేసి సామర్లకోట సమీపంలోని కాలువలో పడేసినట్లు చెప్పింది. మరోసారి బీచ్‌లో పడేసానని చెప్పింది. ఆమె నుంచి అసలు విషయం రాబ‌ట్టేందుకు పోలీసులు అన్ని విధాలుగా విచారిస్తున్నారు.

Next Story
Share it