విశాఖ: ఎల్జీ పాలిమర్స్ కు 50 కోట్ల ఫైన్

By సుభాష్  Published on  9 May 2020 10:45 AM GMT
విశాఖ: ఎల్జీ పాలిమర్స్ కు 50 కోట్ల ఫైన్

ఏపీలోని విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమలో విష వాయువు లీకై 12 మంది మృతి చెందగా, వందలాది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఎల్జీ పాలిమర్స్‌కు పర్యావరణ మంత్రిత్వశాఖకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ నోటీసులు జారీ చేసింది. తక్షణ పరిహారం కింద రూ. 50కోట్లు మధ్యంతర జరిమానాగా జమ చేయాలని ఎల్జీ పాలిమర్స్‌ సంస్థను ఆదేశించింది.

పరిశ్రమలో విషవాయువు లీకేజీపై దర్యాప్తు చేపట్టడానికి ఎన్‌జీటీ చైర్‌ పర్సన్‌ జస్టిస్‌ ఆదర్స్‌ కుమార్‌ గోయెల్‌ నేతృత్వంలో ధర్మాసనం ఐదుగురిని సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసంది. ఈ కమిటీ ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వీసీ వి. రామ చంద్రమూర్తి, ఏయూ కెమికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధిపతి ప్రొఫెసర్‌ పులిపాటి కింగ్‌, సీపీసీబీ సభ్య కార్యదర్శి సీఎస్‌ ఐఆర్‌ డైరెక్టర్‌ వైజాగ్‌ లోని నీరిహెడ్‌ను కమిటీ సభ్యులుగా నియమించింది.

ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు మే 18వ తేదీలోపు నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది. అంతేకాకుండా ఈ దర్యాప్తు బృందానికి విశాఖ కలెక్టర్‌ అన్ని విధాలుగా సహాయ సహకరాలు అందించాలని సూచించింది.

కాగా, శనివారం మృతదేహాలతో బాధితులు పరిశ్రమ ముందు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటే డిమాండ్‌ చేశారు. దీంతో ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ వద్ద తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది. అయితే ఆందోళన కొనసాగుతున్న సమయంలో ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ గ్యాస్‌ లీకైన ప్రాంతాన్ని పరిశీలించేందుకు అక్కడికి రావడంతో మరింత ఆందోళన చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని గేటు లోపలికి రానివ్వకుండా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. గేట్లు తోసివేసి లోపలికి ప్రవేశించారు. సంయమనం పాటించాలని పోలీసులు ఎంత నచ్చజెప్పినా ఆందోళనకారులు శాంతించలేదు. పరిశ్రమ పరిసరాల పరిస్థితిని నగరపోలీస్‌ కమిషనర్‌ ఆర్కే మీనా పర్యవేక్షించారు.

Next Story
Share it