చంద్రునిపై 4జీ నెట్‌వర్క్‌.. నోకియాతో నాసా డీల్‌

By సుభాష్  Published on  20 Oct 2020 5:08 AM GMT
చంద్రునిపై 4జీ నెట్‌వర్క్‌.. నోకియాతో నాసా డీల్‌

చంద్రునిపై 4జీ సెల్యులార్‌ నెట్‌ వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ నోకియా సిద్దమవుతోంది. ఆమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) కోసం ఈ నెట్‌వర్క్‌ను సిద్ధం చేస్తున్నట్లు నోకియా తెలిపింది. అంగారకుడిపైకి మనుషులను పంపే ప్రయత్నాల్లో ఉన్న నాసా.. అందుకు చంద్రుడిని ఒక స్తావరంగా మార్చుకోవాలని ప్రణాళికలు తయారు చేస్తోంది. దీంతో చంద్రుడిపై కొంతకాలం నివాసం ఉండే మనుషుల కోసం 4జీ మొబైల్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనుంది. భూమిపై పూర్తిగా సిద్ధం చేసిన నెట్‌వర్క్‌ పరికరాలను 2022 సంవత్సరంలో చందమామపైకి తీసుకెళ్లి అమర్చుతారు. ఈ నెట్‌వర్క్‌ తయారీకి నోకియాకు నాసా దాదాపు వెయ్యి కోట్లు చెల్లిస్తోంది. చంద్రుడిపై మనిషి మనుగడకు కమ్యూనికేషన్‌ వ్యవస్థ అవసరమని నోకియా తెలిపింది. నోకియా తయారు చేస్తున్న ఈ నెట్‌వర్క్‌లో వ్యోమగాములు ఉండేందుకు స్థావరం, యాంటెన్నాలు ఉన్నాయి.

కాగా, ఈ ప్రాజెక్టు కోసం నోకియాకు నాసా 14.1 మిలియన్‌ డాలర్ల నిధులను అందించనుంది. అయితే టిప్పింగ్‌ పాయింట్‌ ఎంపిక కింద 370 మిలియన్‌ డాలర్లు విలువైన ఒప్పందాలపై సంతకాలు సైతం చేసేసింది. మొదట జాబిల్లిపై 4జీ నెట్‌వర్క్‌ను నోకియా నిర్మిస్తుంది. ఆ తర్వాత దానిని 5జీకి విస్తరించనుంది. ఇది అంతరిక్ష పరిశోధన, అభివృద్ది దిశగా కొనసాగేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందనే చెప్పాలి.

2028 నాటి చంద్రునిపై స్థారం ఏర్పాటే లక్ష్యం

కాగా, 2028 సంవత్సరం నాటికల్లా చందమామపై స్థావరం ఏర్పాటు చేసుకోవాలన్నదే 'నాసా' లక్ష్యమని నాసా అడ్మినిస్టేటర్‌ జిమ్‌ బ్రిడెన్‌స్టెన్‌ వెల్లడించారు. అప్పటి వ్యోమగాములు చంద్రునిపై నివసించడానికి, పనులు ప్రారంభించడానికి సరికొత్త సాంకేతికతను త్వరగా అభివృద్ధి చేయాలని అన్నారు. తాము జాబిల్లిపై ఎక్కువ కాలం ఉండేందుకు విద్యుత్‌ వ్యవస్థ, నివాసం ఎంతో అవసరమని అన్నారు. ఇందుకోసం నాసా నోకియా ఆఫ్‌ అమెరికాతో ఒప్పందం కుదిరింది.



Next Story