45 రోజుల పసికందుకి కరోనా పాజిటివ్

By రాణి  Published on  18 April 2020 3:03 PM GMT
45 రోజుల పసికందుకి కరోనా పాజిటివ్

తెలంగాణలోని నారాయణ్ పేట్ లో 45 రోజుల పసికందుకి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని వైద్యులు అధికారికంగా ధృవీకరించారు. నారాయణ్ పేట్ లో తొలికరోనా కేసు ఇదే. వైరస్ పాజిటివ్ వచ్చిన ఆ పసికందుకి చికిత్స అందించేందుకు నారాయణ్ పేట్ నుంచి హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు, నానమ్మలను అధికారులు క్వారంటైన్ చేశారు. కాగా.. తల్లి బిడ్డకు జన్మనిచ్చాక ఎలాంటి ప్రయాణాలు చేయలేదని, కేవలం ఆస్పత్రి నుంచి ఇంటికే వచ్చామని చెప్తున్నారు కుటుంబ సభ్యులు. జిల్లాలో ఇదే మొదటి కరోనా కేసు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బిడ్డ కుటుంబ సభ్యులతో పాటు డెలివరీ చేసిన వైద్యులు, బిడ్డను కలిసిన మొత్తం 20 మందికి కరోనా టెస్టులు నిర్వహించనున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ హరి చందన మాట్లాడుతూ..ఇప్పటి వరకూ జిల్లాలో 0 కరోనా కేసులే ఉన్నాయన్నారు. ఇప్పుడు కరోనా సోకిన బిడ్డ తల్లిదండ్రులు కూడా జిల్లా దాటి ఎక్కడికి వెళ్లలేదని, వాళ్లు గొర్రెల కాపరులని పేర్కొన్నారు.

Also Read : స్విట్జర్లాండ్ పర్వతంపై త్రివర్ణ పతాకం

బిడ్డకు సామాజిక వ్యాప్తి ద్వారా వైరస్ ఎలా సోకిందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదన్నారు. ఆస్పత్రి సిబ్బంది ద్వారానే వైరస్ సోకి ఉండవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 8న బాబుకి వ్యాక్సిన్ వేయించగా ఏప్రిల్ 11న బాబుకి జ్వరం రాగా చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తీసుకురాగా వైద్యులు మందిచ్చి పంపారు. అయినా బిడ్డ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో మహబూబ్ నగర్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. మహబూబ్ నగర్ ఆస్పత్రి వైద్యులు వెంటనే హైదరాబాద్ నీలోఫర్ కు తీసుకెళ్లాలని తెలిపారు. ఇలా 5 రోజుల నుంచి ఆ పసికందును మూడు ఆస్పత్రుల చుట్టూ తిప్పారు. మొదట బాబుకు జ్వరం మాత్రమే రాగా..మహబూబ్ నగర్ ఆస్పత్రికి వెళ్లాకే కరోనా సోకి ఉండవచ్చని కలెక్టర్ అనుమానం వ్యక్తం చేశారు.

Also Read : లోకేష్ కు హ్యాట్సాఫ్ చెప్పిన విజయసాయిరెడ్డి

Next Story