యూట్యూబ్‌లో 'నీలి నీలి ఆకాశం' పాట రికార్డులు..

By అంజి  Published on  7 April 2020 7:01 AM GMT
యూట్యూబ్‌లో నీలి నీలి ఆకాశం పాట రికార్డులు..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యాంకర్‌ ప్రదీప్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రదీప్‌ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న సినిమా '30 రోజుల్లో ప్రేమించటం ఎలా'. మున్నా దర్శకత్వంలో ఎస్వీ బాబు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో ప్రదీప్‌ మాచిరాజు జోడిగా అమృతా అయ్యర్‌ నటించారు. ఇటీవల '30 రోజుల్లో ప్రేమించటం ఎలా' సినిమా నుంచి విడుదలైన నీలి నీలి ఆకాశం సాంగ్‌ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా అన్ని సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లతో కలిపి 100 మిలియన్ల వ్యూస్‌ రాబట్టినట్లు చిత్రయూనిట్‌ తెలిపింది. సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ అందించిన ఈ పాటకు సంగీతం సమకూర్చాడు. స్వరాలను పాటల రచయిత చంద్రబోస్‌ రాశారు. సిద్‌ శ్రీరామ్‌, సునీత తమ గొంతుతో ఈ పాటను అద్భుతంగా ఆలపించారు.

యూట్యూబ్‌, మ్యూజిక్‌ ఛానెళ్లు, రేడియోల్లో ఈ పాట మారుమ్రోగిపోతోంది. ఉగాది కానుకగా విడుదల అవ్వాల్సిన '30 రోజుల్లో ప్రేమించటం ఎలా' సినిమా మహమ్మారి కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా వాయిదా పడింది. సినిమా పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనులు కూడా పూర్తయ్యాయి. సాధారణ పరిస్థితి నెలకొన్న తర్వాత సినిమాను విడుదల చేస్తామని చిత్ర యూనిట్‌ తెలిపింది.

పల్లవి

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా

మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా

నెలవంకకు ఇద్దామనుకున్నా.. ఓహో ఓహో

నీ నవ్వుకు సరిపోదంటున్నా...

నువ్వే నడిచేటి తీరుకే

తారలు మొలిచాయి నేలకే

నువ్వే వదిలేటి శ్వాసకే

గాలులు బ్రతికాయి చూడవే

ఇంత గొప్ప అందగత్తెకేమి ఇవ్వనే

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా

మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా

చరణం - 1

ఓహో వానవిల్లులో ఉండని రంగు నువ్వులే

ఏ రంగుల చీరను నీకు నెయ్యాలే

నల్ల మబ్బులా మెరిసే కళ్లు నీవిలే

ఆ కళ్లకు కాటుక ఎందుకెట్టాలే

చెక్కిలిపై చుక్కగా దిష్టే పెడతారులే

నీకైతే తనువంతా చుక్కను పెట్టాలే

ఏదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా

ఏది నీ సాటి రాదిక అంటు ఓడాను పూర్తిగా

కనుకే ప్రాణమంత తాళి చేసి నీకు కట్టనా

నీలి నీలి ఆశాశం ఇద్దామనుకున్నా

నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా

చరణం - 2

ఓహో అమ్మ చూపులో వొలికే జాలి నువ్వులే

ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలే

నాన్న వేలితో నడిపే ధైర్యమే నీదే

నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలే

దయ కలిగిన దేవుడే మనలను కలిపాడులే

వరమొసగే దేవుడికే నేనేం తిరిగివ్వాలే

ఏదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా

ఏది నీ సాటి రాదిక అంటూ అలిసాను పూర్తిగా

కనుకే మళ్లి మళ్లీ జన్మనెత్తి నిన్ను చేరనా

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా

మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా



Next Story