గడిచిన మూడేళ్లలో 246 ఏనుగులు మృత్యువాత.!

By అంజి  Published on  19 Feb 2020 10:20 AM GMT
గడిచిన మూడేళ్లలో 246 ఏనుగులు మృత్యువాత.!

భువనేశ్వర్‌: గత మూడేళ్లలో వివిధ కారణాల వల్ల ఒడిశాలో 246 ఏనుగులు చనిపోయాని అసెంబ్లీలో ప్రభుత్వం తెలిపింది. ఒడిశా అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే ముఖేశ్‌ మహాలింగ్‌ అడిగిన ప్రశ్నకు ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రి బిక్రమ్‌ కేసరి అరుఖ్‌ లిఖితపూర్వక సమాధానం చెప్పారు. ప్రమాదవశాత్తు కరెంట్‌ షాక్‌, వ్యాధులు, రైళ్లు, ఇతర వాహనాల ప్రమాదాలు, సహజ ఇతర కారణాల వల్ల 246 ఏనుగులు మృతి చెందాయని తెలిపారు. 2017 గణాంకాల ప్రకారం ఒడిశాలో మొత్తం 1976 ఏనుగుల సంఖ్య ఉందని తెలిపారు. సిమ్లిపాల్‌ ఫారెస్‌ డివిజన్‌లో 330, ధెంకనాల్‌లో 169, సతకోసియాలో 147, అథగాలో 115 ఏనుగులు ఉన్నాయని మంత్రి బిక్రమ్‌ కేసరి అరుఖ్‌ వివరించారు.

ఏనుగుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని వారు చెప్పారు. ఏనుగుల ప్రధాన ఆవాసాను పరిరక్షించడానికి మయూరభంజ్‌, మహానది, సంబల్‌పూర్‌ వంటి ప్రాంతాల్లో జంబో అరణ్యాలనే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి వివిధ నిర్వహణ కార్యక్రమాలను కూడా ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. అంతే కాకుండా, 14 ఏనుగు కారిడార్లు, ఏనుగుల కోసం నీటి వనరుల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రైలు ప్రమాదాల వల్ల ఏనుగులు చనిపోకుండా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి బిక్రమ్‌ కేసరి అరుఖ్‌ తెలిపారు.

ఒడిశాలో తరచూ రోడ్డు ప్రమాదాల వల్ల ఏనుగులు మృతి చెందుతున్నాయి. దీనిపై స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏనుగులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Next Story