ఐదేళ్ల తర్వాత రిపబ్లిక్ డే పరేడ్ లో తెలంగాణ శకటం

By రాణి  Published on  20 Dec 2019 7:29 AM GMT
ఐదేళ్ల తర్వాత రిపబ్లిక్ డే పరేడ్ లో తెలంగాణ శకటం

ముఖ్యాంశాలు

  • 2020 రిపబ్లిక్ డే పరేడ్ లో తెలంగాణ శకటం
  • నమూనాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రప్రభుత్వం
  • ఐదేళ్లుగా రిపబ్లిక్ డే పరేడ్ లో కనిపించని తెలంగాణ శకటం
  • 2018లో బతుకమ్మ పండగ కాన్సెప్ట్ తో నమూనా
  • ఆ నమూనాను తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వం
  • ఈసారి మేడారం, బతుకమ్మ, వేయి స్తంభాల గుడి కాన్సెప్ట్

హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో ఏటా జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ప్రతిష్ఠాత్మకం. ఈ వేడుకల్లో తమ శకటాలను ప్రదర్శించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడతాయి. వీటిలో అన్నిటికంటే మిన్నగా ఉన్న శకటానికి కేంద్ర ప్రభుత్వం బహుమతి కూడా ఇస్తుంది. తమ సంస్కృతీ సంప్రదాయాలను, చేపట్టిన అభివృద్ధి పథకాలనూ, ఉన్నతినీ ప్రతిబింబించే రీతిలో రాష్ట్ర ప్రభుత్వాలు శకటాలను తయారు చేసి రిపబ్లిక్ డే పరేడ్ లో ప్రదర్శిస్తాయి. గడిచిన ఐదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం తరపున రిపబ్లిక్ డే పరేడ్ లో రాష్ట్ర శకటం కనిపించకపోవడం నిజంగానే వెలితిగానే అనిపిస్తోంది తెలంగాణవాసులందరికీ. ఈసారి ప్రభుత్వం దీన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని చక్కటి శకటాన్ని రూపొందిస్తోంది. తెలంగాణలో పెద్ద పండగ బతుకమ్మ, పెద్ద జాతర సమ్మక్కసారలమ్మ, పెద్ద ఆలయం వరంగల్ లోని వేయి స్తంభాల ఆలయం. ఈ మూడింటినీ నేపధ్యంగా తీసుకుని ఈసారి గణతంత్ర వేడుకల శకటాన్ని రూపొందించాలని తలపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నమూనాకు కేంద్రప్రభుత్వంనుంచి అనుమతికూడా వచ్చింది.

శకటంతోపాటుగా రాష్ట్రానికి చెందిన కళాకారులు కూడా ప్రదర్శనలు ఇస్తూ దానిముందు నడుస్తారు. 2018లోకూడా తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతర కాన్సెప్ట్ తో శకటం నమూనాను రూపొందించింది. అయితే అది కార్యరూపం దాల్చకపోవడం బాధాకరమైన విషయంగా మిగిలిపోయింది. ఈ లోటును పూరించుకునేందుకు ఈసారి చక్కటి శకటాన్ని రూపొందించి రిపబ్లిక్ డే పరేడ్ లో ప్రదర్శించాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. 2014లో కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో బోనాలు పండగ కాన్సెప్ట్ తో తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన శకటం ఢిల్లీ పరేడ్ లో అందరినీ ఆకర్షించింది. దురదృష్టవశాత్తూ వివిధ కారణాలవల్ల ఐదేళ్లనుంచీ మళ్లీ పరేడ్ కు శకటాల్ని పంపలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం. ఈసారి ఆ లోటును భర్తీ చేసుకోవాలన్న గట్టి నిర్ణయంతో ప్రత్యేకంగా మూడు ప్రధానమైన అంశాలను మేళవించి శకటాన్ని రూపొందిస్తున్నారు.

ఈ ఏడాది శకటాలకు అనుమతిచ్చిన కేంద్రం

రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన నమూనాలను పరిశీలించి కేంద్రం వాటిని ఆమోదించిన తర్వాతే రిపబ్లిక్ డే పరేడ్ లో రాష్ట్ర శకటాలకు చోటు దక్కుతుంది. గడచిన ఐదేళ్లలోనూ ఎలాంటి కారణం చెప్పకుండానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర తరపున పంపిన నమూనాలను తిరస్కరిస్తూ వచ్చింది. ఈసారి మాత్రం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ కాన్సెప్ట్ కి కేంద్రం నుంచి అనుమతి లభించడం విశేషం. కిందటి ఏడాది రూపొందించిన మేడారం జాతర కాన్సెప్ట్ శకటానికి ఎలాగైనా సరే అనుమతి సాధించాలన్న పట్టుదలతో నాటి రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఒక ప్రత్యేక బృందాన్ని తీసుకుని ఢిల్లీలో మకాం వేసి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఈసారి సమర్పించిన నమూనాకు వెంటనే కేంద్రంనుంచి అనుమతి లభించడంతో తెలంగాణ ప్రభుత్వ అధికారులు సంతోషాన్ని వెలిబుచ్చుతున్నారు.

Next Story