నవశకానికి నవ మన్మధుడు - హృతిక్ రోషన్

By అంజి  Published on  6 Dec 2019 8:42 AM GMT
నవశకానికి నవ మన్మధుడు -  హృతిక్ రోషన్

అసియా వాసుల్లోకెల్లా అందగాడు. ముద్దుగుమ్మల గుండెల్లో గుబులు పుట్టించే నవ మన్మధుడు. కళ్లతోనే కైపు తెప్పించగల సమర్థుడు. గడచిన దశాబ్దంలో అతివల మనసుల్లో మరులుగొలిపే అతి సుందరుడైన అసియా పురుషుడిగా హృతిక్ రోషన్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును పొందాడు. 2019 మోస్ట్ సెక్సీయెస్ట్ ఏషియన్ ఆఫ్ ది డికేడ్ టైటిల్ విన్నర్ గా నిలిచిన ఈ బాలీవుడ్ సూపర్ స్టార్ కి అందగాడిగా మాత్రమే కాక కండలు తిరిగిన వీరుడుగా కూడా ఈ బాలీవుడ్ సూపర్ స్టార్ కి విపరీతమైన క్రేజ్ ఉంది.

లండన్ లోని ఈస్టర్న్ ఐ న్యూస్ పేపర్ 16వ సంచిక 2019 విడుదల చేసిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత అందగాళ్లైన మగాళ్ల జాబితాలో అగ్రస్థానాన్ని సంపాదించుకున్నాడు హృతిక్. గ్రీకు వీరుడిలా కనిపించే తన ఆహార్యానికి అమ్మాయిలు విపరీతంగా ఆకర్షితులవడం హృతిక్ స్పెషాలిటీ.

కహోనా ప్యార్ హై తో బాలీవుడ్ లో జైత్రయాత్రను మొదలుపెట్టిన హృతిక్ సూపర్ 30, వార్ లాంటి సినిమాలతో విశ్వవ్యాప్తంగా క్రేజ్ ని, అభిమానుల్నీ సంపాదించుకున్నాడు. 2017లో ఈ టైటిల్ కి కైవసం చేసుకున్న మరో బాలీవుడ్ లీడింగ్ స్టార్ షాహిద్ కపూర్ ఈసారి రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండో రన్నర్ అప్ గా నిలిచిన వివాన్ ద్సేనా మోస్ట్ సెక్సీ యెస్ట్ టీవీ స్టార్ గా నిలిచాడు.

జాబితాలో మొదటి పది స్థానాల్లో చోటు దక్కించుకున్న టైగర్ ష్రాఫ్ నాలుగో స్థానంలో నిలిచాడు. పాప్ సూపర్ స్టార్ జైన్ మాలిక్ ఐదో స్థానంలో నిలవగా టీవీస్టార్ హర్షద్ చోప్రా కి ఆరో స్థానం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు వేసే ఓట్ల ఆధారంగా ఈ జాబితాను నిర్ణయిస్తారు నిర్వాహకులు. సోషల్ మీడియా సైట్లు, మీడియా ఆకర్షణ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపు ఈ పోటీలో స్థానాల గుర్తింపును ప్రభావితం చేసే అంశాలు.

అభిమానులకు హృతిక్‌ కృతజ్ఞతలు..

భారత్, పాకిస్తాన్ దేశాలతోపాటుగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని అభిమానులు ట్విట్టర్ లో ప్రతిస్పందించి ఓట్లు వేసి మరీ హృతిక్ కు ప్రథమ స్థానాన్ని కట్టబెట్టారు. తనకు ఈ అరుదైన గౌరవాన్ని అదించిన అభిమానులకు హృతిక్ రోషన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.

కేవలం రూపం ఆధారంగా మాత్రమే అభిమానాన్ని పెంచుకోవడం సాధ్యం కాదనీ, నటన పరంగాకూడా పరిణతిని కనపరచడంవల్ల అభిమానం చిరస్థాయిగా నిలిచిపోతుందని హృతిక్ వ్యాఖ్యానించాడు. కేవలం రూపం ఆధారంగా వ్యక్తులను అంచనా వేయడం కష్టమనికూడా అన్నాడు.

నిజజీవితంలో ఎదురయ్యే అనేక ఘటనలు, జీవన పయనం, కలిసే మనుషులు, కూడగట్టుకునే అనుభవాలు, పరిణతి అన్నీ కలిపి వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దుతాయని తను బలంగా నమ్ముతానని హృతిక్ చెప్పాడు.

తన అందంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి వెనక ఎంతో శ్రమ, పట్టుదల దాగి ఉన్నాయని హృతిక్ తన అభిమానులకు చెప్పుకొచ్చాడు. కఠోరమైన వ్యాయామాల ద్వారా శారీరక దృఢత్వాన్ని పెంచుకున్నాననీ, అందమైన ముఖకవళికలు భగవంతుడు ఇచ్చిన వరమనీ అన్నాడీ బాలీవుడ్ సూపర్ స్టార్.

తనను తాను ఎప్పుడూ సెక్సీయెస్ట్ పురుషుడిగా అనుకోలేదని కేవలం తన అభిమానులు చూపిస్తున్న ప్రేమాదరాల ఫలితంగానే తనకు ఈ స్థానం దక్కిందని వివాన్ ద్సేనా చెప్పాడు. ఆ అభిమానాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవడానికి కృషి చేస్తానని తెలిపాడు.

Next Story