అమెరికాలో చిక్కుకున్న 2.50 లక్షల విద్యార్థులు

By రాణి  Published on  13 April 2020 10:25 AM IST
అమెరికాలో చిక్కుకున్న 2.50 లక్షల విద్యార్థులు

అగ్రరాజ్యమైన అమెరికాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. గడిచిన 15 రోజులుగా అమెరికాలో కరోనా మృత్యుఘోష పెడుతోంది. ఇప్పటి వరకూ అక్కడ కరోనా కేసుల సంఖ్య 5.50 లక్షలు దాటగా మృతుల సంఖ్య 22 వేలకు పైగానే నమోదైంది. మరోవైపు న్యూయార్క్ లో కరోనా ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ట్రంప్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్లే అమెరికాకు ఈ దుస్థితి ఏర్పడిందన్న భావం అందరిలోనూ వ్యక్తమవుతోంది. కరోనా విజృంభించకుండా లాక్ డౌన్ విధించకపోవడం, లాక్ డౌన్ అమలు చేస్తే ఎక్కడ ఆర్థికంగా కుంగుబాటుకు గురవ్వాల్సి వస్తుందోనన్న భయంతో అధ్యక్షుడు ట్రంప్ జాగ్రత్తలు తీసుకోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

తాజాగా అమెరికాలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండటంతో అక్కడి యూనివర్శిటీలన్నీ మూతపడ్డాయి. దీంతో అక్కడ చదువుకుంటున్న భారత విద్యార్థులు సుమారు 2.50 లక్షల మంది రోడ్డున పడ్డారు. యూనివర్శిటీలు మూతపడటంతో హాస్టల్స్ లో ఉన్న విద్యార్థులను కూడా ఖాళీ చేయిస్తున్నారు. భారత్ కు తిరిగివచ్చే అవకాశం ఇసుమంతైనా కనిపించకపోవడంతో విద్యార్థులంతా అమెరికాలోని భారత దౌత్య కార్యాలయ అధికారికి వీడియో ద్వారా తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఉండేందుకు నిలువ నీడలేదని, తిరిగి వెళ్లలేమని చెప్పుకున్నారు. అలాగే కొన్ని రోజులకు తమ వీసాల గడువు కూడా ముగియబోతోందని, దయచేసి తమను ఆదుకోవాలని కోరారు. విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకున్న భారత్ ఎంబసీ అధికారి ఉండేందుకు వసతి ఏర్పాట్లు చేస్తామని, ఎట్టిపరిస్థితుల్లోనూ బయటి రావొద్దని సూచించారు. అమెరికాలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ఎక్కడున్నవారు అక్కడే ఉండాల్సిందిగా పేర్కొన్నారు. అలాగే వీసా గడువు ముగిసిన వారికి మరికొంత కాలంపాటు వీసా గడువును పెంచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పరిస్థితి చక్కబడ్డాకే తిరిగి స్వదేశానికి వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

Next Story