షాకింగ్: ఒకే ఐఎంఈఐ నెంబరు మీద 13557 ఫోన్లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Jun 2020 11:07 AM GMT
షాకింగ్: ఒకే ఐఎంఈఐ నెంబరు మీద 13557 ఫోన్లు

ఇప్పటివరకూ ఎప్పుడూ చూడనిది.. తెలియని సైబర్ నేరం ఒకటి బయటకు వచ్చింది. పోలీసు శాఖకు సవాలుగా మారిన ఈ వైనం యూపీలో చోటు చేసుకుంది. మీరట్ పట్టణంలో చోటు చేసుకున్న ఈ వైనం అంతుచిక్కని ఫజిల్ గా మారింది. విచారణలో ప్రతిది ప్రశ్నే తప్ప.. సమాధానం దొరకని తీరు సంచలనంగా మారింది. ఈ నేరం గురించి తెలుసుకోవాలంటే.. కాస్తంత వివరంగా చెబితేనే అర్థమయ్యేది.

ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉండటం తెలిసిందే. ప్రతి ఫోన్ కు ఒక ఐఎంఈఐ నెంబరు ఉండటం తెలిసిందే. పద్నాలుగు నెంబర్లు ఉండే ఈ నెంబరు ప్రతి ఫోన్ కు వేర్వేరుగా ఉంటుంది. ఒక ఫోన్ కు ఉండే ఐఎంఈఐ నెంబరు మరో ఫోన్ కు ఉండదు. ఎప్పుడైనా ఫోన్ పోయిన వెంటనే.. పోలీసుల వద్దకు వెళ్లినప్పుడు.. మొదట అడిగేది ఈ నెంబరు గురించే. దాని ఆధారంగానే ఫోన్ ఎక్కడ ఉన్నది గుర్తిస్తారు.

ఇంతకీ ఈ నెంబరుకు.. ఇప్పుడు చెప్పే నేరానికి మధ్య లింకేమిటంటే.. మీరట్ కు చెందిన ఒక వ్యక్తి మొబైల్ నెంబరు ఇటీవల పాడైంది. దాన్ని సదరు కంపెనీ సర్వీసు సెంటర్ లో రిపేర్ కు ఇచ్చారు. మొబైల్ ఫోన్ తీసుకున్న తర్వాత.. ఏదో అనుమానంతో ఐఎంఈఐ నెంబరు చెక్ చేసిన అతగాడు ఆశ్చర్యానికి గురయ్యాడు. ఎందుకంటే.. రిపేర్ కు ఇచ్చే సమయంలోని నెంబరకు.. తర్వాత నెంబరుకు సంబంధం లేకపోవటంతో సైబర్ క్రైం టీమ్ కు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ టీం ఈ వ్యవహారాన్ని లోతుగా పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు షాకింగ్ నిజాల్ని గుర్తించారు. ఒకే ఐఎంఈఐ నెంబరు మీద 13557 ఫోన్లు ఉన్నట్లు గుర్తించారు. ఎందుకిలా? అన్న దానిపై ఆరా తీయగా.. సమాచారం అందలేదు కానీ.. అవన్నీ చైనాకు చెందిన ఒకే కంపెనీకి చెందిన ఫోన్లుగా గుర్తించారు. మరో షాకింగ్ నిజం ఏమంటే.. ఒకే నెంబరు మీద ఉన్న వేలాది ఫోన్లు యాక్టివ్ గా ఉండటంతో ఎందుకిలా? అన్న దాని మీద వారు విశ్లేషణ మొదలు పెట్టారు. సాంకేతికమైన తప్పా లేదంటే ఇంకేదైనా పెద్ద విషయం ఏదైనా ఉందన్నది ఇప్పుడు సవాలుగా మారింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న మీరట్ సైబర్ పోలీసులు.. ఈ సీక్రెట్ ను చేధించే పనిలో పడ్డారు.

Next Story