1 నుంచి 9వ తరగతి విద్యార్థుల పరీక్షలు రద్దు: కేసీఆర్
By సుభాష్ Published on 11 April 2020 10:15 PM ISTతెలంగాణలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ఉదాంతం తర్వాత దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోయాయి. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండగా, ఈనెల 14తో ముగియనుంది. దీంతో లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30 వరకూ పొడిగిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. శనివారం మంత్రివర్గ సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈనెల 30 వరకూ లాక్‌డౌన్ పొడిగింపు ఉంటుందని, ప్రతీ ఒక్కరూ సహకరించాలన్నారు.
అలాగే విద్యార్థులు కూడా ఎలాంటి ఆందోళన చెందవద్దని, 1 నుంచి 9వ తరగతి వరకూ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. వారందరినీ పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా పదో తరగతి విద్యార్థుల పరీక్షలపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు.
అలాగే ప్రజల కనీస అవసరరాల కోసం కొన్ని సడలింపులు అవసరమని, కంటైన్‌మెంట్ జోన్‌లలో నిత్యవసరరాలు డోర్ డెలివరీ చేస్తున్నామన్నారు. ఇక తినుబండారాలు, నూనెలు కల్తీ చేసేవాళ్లపై పీడీ యాక్ట్ తప్పదని హెచ్చరించారు. వ్యవసాయ పనులకు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు లాక్‌డౌన్ మినహాయింపు ఉంటుందని తెలిపారు. రాష్ట్రాలు తీసుకున్న అప్పులను ఆరు నెలల పాటు వాయిదా వేయాలని కేంద్రాన్ని కోరగా, అందుకు ప్రధాని మోదీ కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారన్నారు.