ఈ కరోనా ఏం చేస్తుందీ.. భయం వద్దంటున్న వందేళ్ల బామ్మ

By మధుసూదనరావు రామదుర్గం  Published on  26 July 2020 2:50 PM IST
ఈ కరోనా ఏం చేస్తుందీ.. భయం వద్దంటున్న వందేళ్ల బామ్మ

కరోనా అంటే చాలు పిల్లలు పెద్దలు అందరూ బెంబేలెత్తి పోతున్నారు. ఈ మహమ్మారి మమ్మల్ని తాకకుంటే చాలురా దేవుడా అంటూ వణుకుతున్నారు. రోజూ టీవీల్లో, పేపర్లో, సోషల్‌ మీడియాల్లో కరోనా వచ్చిన వారి కష్టాలు చూసి ఒకటే టెన్షన్‌ పడిపోతున్నారు. పొద్దున లేస్తునే చాలు ‘అయ్యో ఆ కాలనీలో ఒకరికి వచ్చిందంటా.. అధికారులు వచ్చి కుటుంబ‌ సభ్యుల్ని లాక్కెళ్లారంటా’ అంటూ తెగ హైరానా పడిపోతున్నాం. శానిటైర్లతో చేతులు అదేపనిగా రుద్దుకున్నా, మూతికి మాస్క్‌లు బిగించుకున్నా.. అందరికీ దూరంగా బిక్కుబిక్కుమంటూ బతుకతున్నా.. ఈ కరోనా భయం పోవడం లేదేంట్రా సామీ అంటూ బేజారవుతున్నారా.. అయితే మీరు ఒక్కసారి ఈ బామ్మ విజయగాథను చదవాల్సిందే.

కర్ణాటకలోని బళ్లారి జిల్లా హూవిన అడగలిలో ఉంటున్న ఈ బామ్మ హళ్ళమ్మకు ఈనెల మొదట్లో చేపట్టిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఇంట్లో అందరూ కంగారు పడ్డారు. అసలే సెంచిరీ కొట్టింది. ఈ కరోనా ధాటికి ఏమవుతుందో ఏమో అని భయపడ్డారు. డాక్టర్లు ఆమెకు రెగ్యులర్‌గా వైద్యం అందించారు. తను బాగా భోంచేయడమే కాకుండా అదనంగా రోజుకో యాపిల్‌ పండు తినేది. ఈనెల 16న జరిపిన పరీక్షల్లో హళ్ళమ్మకు పాజిటివ్‌ అని తేలింది. అంతకు ముందు మూడోతేదీన ఆమె కుమారుడికి పాజిటవ్‌ వచ్చింది. తను బ్యాంకులో పనిచేస్తున్నాడు. వైద్యం అందించాక బామ్మకు మళ్ళీ ఈనెల 22న పరీక్ష చేసిన డాక్టర్లకు ఆశ్చర్యంతోపాటు ఆనందమేసింది. కారణం నెగిటివ్‌ రావడమే.

ఔరా బామ్మ.. ఎంత గట్టిపిండం అని చుట్టుపక్కల వాళ్ళు ముక్కుపై వేలేసుకున్నారు. ఈ సందర్భంగా బామ్మ మాట్లాడుతూ ‘ఈ కరోనా ఏం చేయదు. వస్తే డాక్టర్లు చెప్పినట్టు మందులేసుకుటే తగ్గిపోతుంది. అనవసరంగా భయపడకండి ఇదీ జలుబులాంటిదే వస్తుంది...మందులేస్తే అదంతటదే పోతుంది’ అంటూ కరోనా బతుకింతేనని తేల్చేసింది. అంతేకాదు కరోనా పేరు వింటే చాలు అదిరిపడే వారికి తనలా ధైర్యంగా ఉండాలని పనిలోపనిగా ఓ ఉచిత సలహా పడేసింది. బాప్‌రే బామ్మ నువ్వు గ్రేట్‌!!

Next Story