ముఖ్యాంశాలు

  • అప్పట్లో రంగూన్ కి వెళ్తూ మునిగిపోయిన నౌక
  • అగ్నిప్రమాదం కారణంగా సముద్రంలో నౌక మునక
  • 90 మంది ఆ ప్రమాదంలో మృత్యువాత
  • 1917లో శ్రీకాకుళం జిల్లా బారువా గ్రామం దగ్గర ఘటన
  • వందేళ్లక్రితం మునిగిపోయిన ఆ నౌక పేరు “చిలక”
  • బ్రిటిష్ ఇండియా నావిగేషన్ కి సంబంధించిన నౌక
  • “చిలక” ఆనవాళ్లు గుర్తించిన స్కూబా డైవింగ్ బృందం
  • ఈ బృందానికి ఓ రిటైర్డ్ నేవీ అధికారి నాయకత్వం
  • రిటైరైన తర్వాత స్కూబా డైవింగ్ శిక్షణ ఇస్తున్న బలరామ్
  • ఔత్సాహికులైన బృంద సభ్యుల కృషివల్ల దొరికిన నౌక ఆచూకీ

రిపబ్లిక్ దినోత్సవం వేళ వైజాగ్ ప్రజలందరూ ఆనంద సందోహాల్లో మునిగి ఉన్న సమయంలో రిటైర్డ్ నేవీ అధికారి బలరామ్ నాయుడు, ఆయన బృందం కలిసి ఎన్నో ఏళ్లుగా మరుగునపడిపోయిన ఓ నిజాన్ని వెలికితీశారు. శ్రీకాకుళం జిల్లా బారువ గ్రామం సమీపంలో సముద్రంలో వందేళ్లక్రితం మునిగిపోయిన ఓ నౌక శకలాలను గుర్తించి బైటి ప్రపంచానికి వెల్లడించిందీ టీమ్.

బ్రిటిష్ ఇండియా నావిగేషన్ కంపెనీకి చెందిన కార్గో నౌక చిలక 1917లో రంగూన్ కి వెళ్తూ బారువ సమీపంలో మునిగిపోయింది. అప్పట్నుంచీ ఇప్పటివరకూ దానికి సంబంధించిన అయిపూ అజ లేనేలేవు. అగ్నిప్రమాదంవల్ల సముద్రంలో మునిగిపోయిన ఆ నౌకలోఉన్నవాళ్లలో అప్పట్లో 90మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఇండియన్ నేవీలో పనిచేసి పదవీవిరమణ పొందిన అధికారి బలరామ్ నాయుడు ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖకు అనుబంధంగా లివిన్ అడ్వెంచెర్స్ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా ఆయన స్కూబా డైవింగ్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం సమీపంలో ఉన్న బీచ్ లలో దీనికి సంబంధించిన కార్యకలాపాలు సాగుతుంటాయి. ఈ ప్రాంతాన్ని ఓ మేజర్ స్పూబా డైవింగ్ హబ్ గా తీర్చిదిద్దేందుకు బలరామ్ విశేషంగా కృషి చేస్తున్నారు. స్కూబా డైవింగ్ ప్రేమికులకు సముద్రంలో మునిగిపోయిన నౌకలకు సంబంధించిన విషయాలు, ఇతరత్రా వ్యవహారాల గురించి తెలుసుకోవడంలో చాలా ఆసక్తి ఉంటుంది. ఈ నేపధ్యంలో శ్రీకాకుళం సమీపంలోని బారువా ప్రాంతంలో మునిగిపోయిన వందేళ్లనాటి షిప్ గురించి అన్వేషణ మొదలుపెట్టిన ఈ బృందం ఫలితాన్ని సాధించడంలో సక్సెస్ ని సొంతం చేసుకుంది.

100 Years Of Boat Chilaka 2

బారువా సముద్ర తీరానికి దాదాపుగ 40 మీటర్ల దూరంలో కట్టి ఉన్న ఎరజెండా ఈ బృందం దృష్టిని ఆకర్షించింది. అక్కడ ఆ ఎర్ర జెండాను ఎందుకు కట్టారు అని వీళ్లు స్థానిక జాలర్లను అడిగారు. అది చాలా ప్రమాదకరమైన ప్రాంతమనీ, గతంలో ఎన్నో ఏళ్ల క్రితం అక్కడ ఓ పెద్ద నౌకకూడా మునిగిపోయిందని అందరూ చెప్పుకుంటారనీ వాళ్లు సమాధానం చెప్పారు. ఆ క్లూని పట్టుకుని ఈ స్కూబా డైవింగ్ బృందం ఇంటర్ నెట్ లో చిలక నౌకకు సంబంధించిన వివరాలను అన్వేషించింది. కొన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత ధైర్యం చేసి ఈ బృందం స్కూబా డైవింగ్ కుబయలుదేరింది. సముద్రంలో వెళ్లగా వెళ్లగా చాలా లోతులో వందేళ్లనాడు మునిగిపోయిన నౌక ఆనవాళ్లు కనిపించాయి. తీరానికి 400 మీటర్ల దూరంలో దాదాపు ఏడు మీటర్లకంటే ఎక్కువ లోతులో నాడు మునిగిపోయిన చిలక నౌక ఆనవాళ్లు వీళ్లకు కనిపించాయి.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.