టాన్ ను తొలగించి..చర్మ సౌందర్యాన్ని పెంచే ఫేస్ ప్యాక్స్..మీకోసం
By రాణి Published on 13 Feb 2020 11:48 AM GMTఅసలే వేసవి వచ్చేస్తోంది. ఠారెత్తించే ఎండలు. ఈ ఎండల్లో తిరగడం వల్ల చాలా మంది తమ చర్మసౌందర్యాన్ని కోల్పోతుంటారు. ఎండ వేడికి శరీరం నల్లబడటం, టాన్ ఏర్పడటం వంటివి సహజం. వీటిని తొలగించుకునేందుకు నానా అవస్థలు పడుతుంటారు. ముఖ్యంగా మహిళలు, యువతులు పార్లర్లకు వెళ్లి అక్కడ రసాయనపూరితమైన క్రీమ్ లు పూయించుకుని వేలకు వేలు వదిలించుకుంటారు..కానీ ఆ కాంతి రెండుమూడ్రోజుల పండుగే. అందుకే మహిళలు, యువతుల చర్మ సౌందర్యం, టాన్ ను పోగొట్టేందుకు రసాయనాల్లేని 10 హోమ్ రెమడీలను పరిచయం చేస్తున్నాం. నచ్చితే మీరూ ట్రై చేసి చూడండి.
1. కూలింగ్ ఫేస్ ప్యాక్
కలబంద మానవాళికి ప్రకృతి అడగకుండానే ఇచ్చిన బహుమతి. కలబందతో రెగ్యులర్ గా ఫేస్ ప్యాక్ వేసుకుంటే..అది ఇచ్చినన్ని మంచి ఫలితాలు ఏ కెమికల్ క్రీమ్ లు ఇవ్వలేవనుకోండి.
కొద్దిగా కలబంద గుజ్జును ఒక గిన్నెలోకి తీసి దానిని స్పూన్ తో గుజ్జులా అయ్యే వరకూ కలపాలి. గుజ్జు రెడీ అయ్యాక అందులోనే కొంచెం తేనె, చిటికెడు పసుపు వేసి మళ్లీ కలపాలి. ఇలా తయారు చేసుకున్న ఫేస్ ప్యాక్ ను ముఖానికి రాసుకుని 10-15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. ఆ తర్వాత మెత్తటి టవల్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా 3-4 రోజులకోసారి కూలింగ్ ఫేస్ ప్యాక్ వేసుకుంటే..15 రోజుల్లో మీరు ఊహించని చర్మ సౌందర్యం మీ సొంతమవుతుంది.
2.టొమాటో ఫేస్ ప్యాక్
ముఖానికి పట్టిన ట్యాన్ ను వదిలించడంలో టొమాటోను మించింది మరొకటి లేదని చెప్పాలి. ఇందులో ఉండే పులుపు ట్యాన్ ను తొలగింపజేస్తుంది. కళ్ల కింద ఉండే నల్లటి వలయాలను కూడా టొమాటో మాయం చేసేస్తుంది.
ఒక టొమాటోను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, వాటిని ఒక గిన్నెలో వేసి గుజ్జులా అయ్యేంత వరకూ కలపాలి. అలా గుజ్జులా తయారు చేసుకున్నాక ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి..20 నిమిషాల వరకూ మసాజ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకుని మెత్తటి టవల్ తో తడి లేకుండా తుడుచుకొని, మీ ముఖానికి సరిపోయే మాశ్చురైజర్ ను కొద్దిగా రాయండి. ఇలా వారానికి 2-3 సార్లు టొమాటో ప్యాక్ వేసుకుంటే ట్యాన్ తో పాటు ముఖం మీదుండే నల్లటి వలయాలు కూడా పోతాయ్.
3.మిల్క్ పౌడర్ ఫేస్ ప్యాక్
సన్ టాన్ ను తొలగించడంలో మిల్క్ పౌడర్ కూడా చాలా సహాయపడుతుంది. చాలా మందికి ఈ విషయం తెలీదు. ఇందులో ఉండే మినరల్స్, విటమిన్స్, లాటిక్ యాసిడ్ టాన్ ను తొలగించడంలో సహాయపడుతాయి.
మిల్క్ పౌడర్, తేనె, నిమ్మరసాన్ని సమపాళ్లలో ఒక గిన్నెలో వేసుకుని కలుపుకోవాలి. అలా కలుపుకున్న మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. అనంతరం ముఖానికి మాశ్చురైజర్ ను రాసుకోవాలి.
4.బేసిన్ ఫేస్ ప్యాక్
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అనరు. మన పూర్వీకులు ఒంటికి శనగపిండితోకూడా నలుగు పెట్టుకునే వారు. అందుకే వారి చర్మం ఇప్పటికి కూడా కాంతివంతంగానే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫేస్ ప్యాక్ అదే.
ఒక స్పూన్ శనగపిండిలో చిటికెడు పసుపు, ఒక స్పూన్ పెరుగు వేసి బాగా కలపాలి. అలా మెత్తగా కలుపుకున్న మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిపోయాక చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. అనంతరం మీ ముఖానికి సరిపోయే మాశ్చురైజర్ ను రాసుకోవాలి. ఈ ప్యాక్ ను రోజు విడిచి రోజు పడుకునే ముందు వేసుకుంటే ముఖానికి పట్టిన ట్యాన్, నల్లటి వలయాలు మాయమవుతాయి.
5.కాఫీ ఫేస్ ప్యాక్
కాఫీ పొడిని ఇంత వరకూ పాలల్లో కలుపుకుని తాగి ఉంటారు గానీ..కాఫీ ఫేస్ ప్యాక్ ఎప్పుడైనా ట్రై చేశారా ? చేయకపోతే ఇప్పుడు చేసి చూడండి. మీ ముఖానికి పట్టిన ట్యాన్ ను వదిలిస్తుంది కాఫీ పొడి.
ఒక స్పూన్ కాఫీ పొడి, ఒక స్పూన్ పసుపు సరిపడా పెరుగు వేసుకుని మెత్తగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు సార్లు కాఫీ ఫేస్ ప్యాక్ వేసుకోవాలి.
6.పసుపు ఫేస్ ప్యాక్
ఒక గిన్నెలో 5:1 నిష్పత్తితో పాలు, పసుపు వేసి కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట సేపు వదిలేయాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికోసారి రాత్రి పడుకోబోయే ముందు ఫేస్ ప్యాక్ వేసుకుంటే..నెలరోజుల్లో టాన్ పోయి..మీ ముఖం అందంగా తయారవుతుంది.
7.కమలా ఫేస్ ఫ్యాక్
ఎండిన కమలా తోళ్లతో చేసిన పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని..దానికి సరిపడా పాలు పోసి మెత్తగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడుక్కోవాలి. కమలాలో ఉండే సి విటన్ టాన్ తొలగించడంతో పాటు ముఖంపై ఉండే ముడతలను పోగొట్టడంలో కూడా సహాయపడుతుంది. అలాగే ముఖాన్నికాంతివంతంగా తయారు చేయడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది.
8.బొప్పాయి ఫేస్ ప్యాక్
బాగా పండిన బొప్పాయిని ముక్కలుగా చేసుకుని పేస్ట్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా నిమ్మరసం, తేనెను వేసి మళ్లీ కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి..ఆరిపోయాక నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ ఫేస్ ప్యాక్ వేసుకుంటే నెలరోజుల్లో ట్యాన్ తో పాటు, ముఖానికున్న నల్లటి వలయాలు సైతం తొలగిపోతాయి.
9.షుగర్ ఫేస్ ప్యాక్
పంచదార, నిమ్మరసంతో వేసుకునే ఈ ఫేస్ ప్యాక్ టాన్ ను త్వరగా తొలగించడంలో సహాయపడుతుంది. కొద్దిగా పంచదార పొడి తీసుకుని..అందులో నిమ్మరసం కలిపి టాన్ పట్టిన ప్రాంతాల్లో అప్లై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. వారానికి రెండుసార్లు ఇలా ట్రై చేస్తే..బెటర్ రిజల్ట్స్ వస్తాయి.
10. పెరుగు ఫేస్ ప్యాక్
పెరుగులో కొద్దిగా పసుపు వేసి అందులో కలిసేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత నీటితో కడుక్కొని..మీ ముఖానికి సరిపోయే మాయిశ్చరైజర్ ను రాసుకోవాలి. ఇలా రోజు విడిచి రోజు ఈ ఫేస్ ప్యాక్ ను ట్రై చేస్తే..ముఖ కాంతి కూడా పెరుగుతుంది.
ఇలా 10 ఫేస్ ప్యాక్ లలో మీకు అందుబాటులో ఉండే పదార్థాలతో మీకు నచ్చిన ఫేస్ ప్యాక్ లను ట్రై చేసి మీ ముఖానికి పట్టిన టాన్ ను తొలగించుకునే ప్రయత్నం చేయండి. గుర్తుంచుకోండి..అన్నీ ఒకేసారి చేయకూడదు. ఏదొక ప్యాక్ ను ఎంచుకుని దానినే కంటిన్యూ చేస్తే..మంచి రిజల్ట్ వస్తుంది.