చంద్రయాన్ 2 | చందమామ నుంచి ఫోటోలు వచ్చేస్తున్నాయోచ్.!

By Medi Samrat  Published on  17 Nov 2019 8:50 AM GMT
చంద్రయాన్ 2 | చందమామ నుంచి ఫోటోలు వచ్చేస్తున్నాయోచ్.!

విక్రమ్ చంద్రుడి ఉపరితలంలో సాఫ్ట్ లాండింగ్ చేయలేక బోల్తా పడిపోయి ఉండొచ్చు. కానీ చంద్రయాన్ 2 ఆర్బిటర్ మాత్రం యథావిధిగా పనిచేస్తోంది. చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన ఫోటోలను జాగ్రత్తగా తీసి మరీ పంపిస్తోంది. చంద్రుడి ఉపరితలం ముఖం నిండా మొటిమలున్నట్టు ఉంటుంది. క్రేటర్లు అని ముద్దుగా పిలుచుకునే గుంటలు ఉంటాయి. వీటితో పాటు అగ్నిపర్వతాల నుంచి వెలువడ్డ లావా వెళ్లే లావా ట్యూబ్ లు అనే మార్గాలు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉంటాయి . ఇవే కాక లావా ఘనీభవించిపోయిన తరువాత మిగిలిపోయే శుష్క మార్గాలు (వీటిని రిల్లర్స్ అంటారు) కూడా ఉంటాయి. వీటి తాలూకు ఫోటోలు పెద్ద సంఖ్యలో చంద్రయాన్ 2 ఇస్రో లాబరేటరీలకు పంపుతోంది.

అంతరిక్షం నుంచి ఉల్కల వంటివి చంద్రుడి ఉపరితలం మీద పడితే క్రేటర్లు ఏర్పడతాయి. అదే విధంగా లావా ట్యూబులు లేదా రిల్లర్స్ ఉన్నాయంటే అక్కడ జీవజాలం ఉండే అవకాశాలున్నట్టుగా పరిగణిస్తారు. వీటితో పాటు ఇంకిపోయి, దగ్గరకు వచ్చి ముడుచుకుపోయిన లావా మార్గాలు ముడుతలరూపంలో కనిపిస్తాయి. వీటిని డోర్సా అంటారు. అదే విధంగా లావాను ఉత్పత్తి చేయడం ఆగిపోయి, ముడుచుకుపోతున్న అగ్నిముఖాలు కూడా కనిపిస్తాయి. వీటిని లూనార్ డోమ్స్ అంటారు. ఈచిత్రాల ఆధారంగా వీటి పరిమాణాన్ని అంచనావేయడానికి వీలవుతుంది. చంద్రుడి వయసును కూడా లెక్కించడానికి వీలవుతుంది.

అందుకే చంద్రయాన్ పంపుతున్న ఈ చిత్రాలు చాలా కీలకం. చంద్రుడిని అర్థం చేసుకోవడంలో , ఆయన ఉపరితలాన్ని అర్థం చేసుకోవడంలో ఇవి చాలా ఉపయోగపడతాయి. అందుకే మన రోవర్ వ్రతం చెడ్డా, చంద్రయాన్ ఫలం దక్కినందుకు మనం సంతోషపడాలి.

Next Story