ఉంగరాన్ని మింగిన ఐదు నెలల చిన్నారి.. గొంతులో ఇరుక్కుపోయింది

By సుభాష్  Published on  22 Dec 2019 12:35 PM GMT
ఉంగరాన్ని మింగిన ఐదు నెలల చిన్నారి.. గొంతులో ఇరుక్కుపోయింది

ఆడుతూ..పాడుతూ ఉంగరం మింగిన చిన్నారి ఇబ్బందుల పాలయ్యాడు. కామారెడ్డి జిల్లా, బాన్సువాడలో ఓ తల్లిదండ్రులు తమ ఐదు నెలలున్న చిన్నారికి ఉంగరాన్ని తొడిగించారు. తర్వాత అది వేలు నుంచి ఊడి కింద పడటంతో ఆ చిన్నారి ఆడుతూ ఆ ఉంగరాన్ని మింగేశాడు. అంతే.. ఆ ఉంగరం గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఆ ఐదు నెలల శిశువు యాసిన్‌ బాధతో విలవిలలాడిపోయాడు . ఉంగరం మింగడం గమనించిన తల్లిదండ్రులు టెన్షన్‌కు గురై హుటాహుటిన చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఎక్స్‌రే తీసి పరిశీలించగా, ఉంగరం గొంతులో ఇరుక్కుపోయినట్లు వైద్యులు గుర్తించారు. వైద్యపరికరాల సాయంతో చికిత్స నిర్వహించి ఉంగరాన్ని బయటకు తీశారు. చిన్నారి బతికి బయట పడ్డాడు. దీంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం చిన్నారి క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇంట్లో ఉన్న వస్తువులను చిన్నారుల వద్ద పెట్టరాదని, వారు పెద్దగయ్యే వరకు ఎప్పుడు వారిని గమనిస్తూ ఉండాలని వైద్యులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.

Next Story
Share it